Winter Hair Care Tips: చలికాలంలో జుట్టు రాలుతోందా? వెంటనే ఈ చిట్కాలను పాటించండి!
ఈ వార్తాకథనం ఏంటి
చలికాలం వచ్చిందంటే చర్మం మాత్రమే కాదు...జుట్టుకూ అదే ఇబ్బందులు! చల్లని గాలులు వీచే ఈ సీజన్‌లో స్కాల్ప్‌లోని సహజ తేమ తగ్గిపోవడం వల్ల వెంట్రుకలు పొడిబారిపోతాయి. కుదుళ్లు బలహీనపడి జుట్టు రాలిపోవడం, కొసలు చిట్లిపోవడం, చుండ్రు పెరగడం వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. అందుకే వింటర్‌లో జుట్టు సంరక్షణకు అదనపు జాగ్రత్త అవసరం. చలికాలంలో చాలామంది ఎక్కువసార్లు తలస్నానం చేయడం పొరపాటు. తరచుగా తలస్నానం చేస్తే స్కాల్ప్‌లోని సహజనూనెలు పోయి జట్టు ఇంకా డ్రై అవుతుంది. అందుకే వారానికి రెండుసార్లు మాత్రమే తలస్నానం చేయమని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే స్కాల్ప్‌కు గెంటిల్‌గా ఉండే షాంపూలను మాత్రమే వాడాలి. షాంపూ చేసే ముందు కొంచెం నూనె లేదా కండిషనర్ రాసుకుంటే రసాయనాల దుష్ప్రభావం తగ్గుతుంది.
Details
రెండుసార్లు నూనెతో మసాజ్ చేయాలి
అదేవిధంగా బాగా వేడి నీటితో తలస్నానం చేయకుండా గోరువెచ్చని నీటిని మాత్రమే వాడాలి. వెంట్రుకల ఊడిపోవడం తగ్గాలంటే వారానికి రెండు సార్లు నూనె మసాజ్ చేయడం మంచి పద్ధతి. కొబ్బరి నూనె, బాదం నూనె, ఆలివ్ ఆయిల్ వంటి సహజ నూనెలు స్కాల్ప్‌కి తేమనిచ్చి కుదుళ్లను బలపరుస్తాయి. తడి జుట్టుతో బయటకు వెళ్లడం మంచిది కాదు. బయట గాలిలో ఉండే దుమ్ము, అలర్జీ కారకాలు వెంట్రుకలకు అంటుకుని వాటిని మరింత బలహీనపరుస్తాయి. హెయిర్ స్టైలింగ్ కోసం హీట్ డ్రయర్లు, స్ట్రయిటనర్లు, కర్లర్లు లాంటివి ఎక్కువగా వాడడం చలికాలంలో జట్టుకు మరింత హానికరం. ఇవి వేడి ఇవ్వడం వల్ల వెంట్రుకలు మరింతగా డ్రై అవుతాయి.
Details
విటమిన్ A, E, జింక్, బయోటిన్ వంటి పోషకాల ఆహారాన్ని తీసుకోవాలి
వీలైనంత వరకు ఇవి దూరంగా పెట్టి జుట్టును సహజంగా ఆరబెట్టుకోవడం మంచిది. జుట్టు ఆరోగ్యం ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి విటమిన్ A, E, జింక్, బయోటిన్ వంటి పోషకాలు ఉన్న ఆహారాలు తీసుకోవాలి. ఇవి స్కాల్ప్‌లో రక్త ప్రసరణను మెరుగుపరచి సీబం ఉత్పత్తిని సరిచేస్తాయి. ఇంట్లోనే పోషకమైన హెయిర్ మాస్క్ కూడా తయారుచేసుకోవచ్చు. పెరుగు, గుడ్డు, అరటి, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, విటమిన్ E క్యాప్సూల్ కలిపి పేస్ట్‌లా తయారుచేసి తలస్నానం తర్వాత జుట్టుకు రాసి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేస్తే వెంట్రుకలకు నిగారింపు, బలం వస్తాయి.