LOADING...
IT to Auto-driver: డబ్బు కాదు, మనశ్శాంతి కావాలి.. ఐటీ ఉద్యోగాన్ని వదిలి ఆటో డ్రైవర్‌గా మారిన మహిళ
డబ్బు కాదు, మనశ్శాంతి కావాలి.. ఐటీ ఉద్యోగాన్ని వదిలి ఆటో డ్రైవర్‌గా మారిన మహిళ

IT to Auto-driver: డబ్బు కాదు, మనశ్శాంతి కావాలి.. ఐటీ ఉద్యోగాన్ని వదిలి ఆటో డ్రైవర్‌గా మారిన మహిళ

వ్రాసిన వారు Moogati Shabari
May 30, 2026
04:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒకప్పుడు ఐటీ ఉద్యోగం అంటే సమాజంలో ప్రత్యేక గౌరవం ఉండేది. సాఫ్ట్‌ వేర్ ఉద్యోగం చేస్తున్న అబ్బాయిలకు పెళ్లి సంబంధాల్లో అధిక ప్రాధాన్యత లభించేది. భారీ కట్నాలతో పెళ్లిళ్లు జరగడం, అధిక వేతనాలు, సొంత ఇళ్లు, కార్లు వంటి సౌకర్యాలతో ఐటీ ఉద్యోగుల జీవితం ఎంతో ఆకర్షణీయంగా కనిపించేది. అయితే కాలక్రమేణా పరిస్థితులు మారిపోయాయి. ప్రస్తుతం ఐటీ రంగంలో పెరిగిన పని ఒత్తిడి, నిరంతర లక్ష్యాల ఒత్తిడితో కూడిన జీవనం, అలాగే కృత్రిమ మేధస్సు (AI) ప్రభావంతో ఉద్యోగ భద్రతపై నెలకొన్న సందేహం కారణంగా చాలామంది మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

వివరాలు

ఒత్తిడికి దూరంగా..

ఇలాంటి నేపథ్యంలో ఒక మహిళ తన ఐటీ మేనేజర్ ఉద్యోగాన్ని వదిలి ఆటో డ్రైవర్‌గా మారిన సంఘటన సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారి తీసింది. ఆమె తీసుకున్న నిర్ణయం పట్ల నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ జీవితంలోని ఒత్తిడికి దూరంగా ప్రశాంతమైన జీవితం గడపాలనే ఉద్దేశంతోనే ఈ మార్పు చేసుకున్నట్లు ఆమె వెల్లడించింది. ఈ మహిళ కథను వ్యాపారవేత్త డాక్టర్ నెజ్రిన్ మిధ్లాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకున్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో ఆమెతో మాట్లాడిన అనంతరం ఈ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాలు

ఆమె నిర్ణయాన్ని ప్రశంసిస్తున్న నెటిజన్లు..

తాను దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు ఐటీ రంగంలో పనిచేశానని, అయితే నిరంతర ఒత్తిడి, మానసిక అలసట కారణంగా ఆ ఉద్యోగాన్ని వదిలేయాల్సి వచ్చిందని ఆమె తెలిపింది. అనంతరం సొంతంగా ఆటో కొనుగోలు చేసి డ్రైవింగ్‌ను వృత్తిగా ఎంచుకున్నట్లు చెప్పింది. ప్రస్తుతం ఆటో నడపడం ద్వారా ప్రతి నెల సుమారు రూ.60 వేల వరకు ఆదాయం పొందుతున్నానని ఆమె పేర్కొంది. అయితే ఆర్థిక లాభం కంటే మానసిక ప్రశాంతత, వ్యక్తిగత సంతోషమే తనకు ఎక్కువ విలువైనవిగా భావిస్తున్నట్లు వెల్లడించింది. తాను ఇష్టపడే విధంగా జీవితం గడపగలుగుతున్నానని కూడా ఆమె చెప్పింది. ఈ కథపై స్పందించిన పలువురు నెటిజన్లు ఆమె నిర్ణయాన్ని ప్రశంసించారు.

Advertisement