Karthika Pournami : ఆ పౌర్ణమి రోజు ఉసిరికాయ దానం చేస్తే లక్ష్మీ కటాక్షమే
కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే 15వ రోజు పౌర్ణమి. దీన్నే కార్తీక పౌర్ణమి అంటారు.ఈ రోజునే కార్తీక పౌర్ణమి పండుగను జరుపుకుంటారు. ఇది చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.పౌర్ణమి రోజున శివాలయాలు భక్తజనంతో శివ శివ అంటుంటాయి. ఈ పర్వదినాన శివుడికి రుద్రాభిషేకం చేస్తే సకల సంపదలు కలిగి, సర్వం సర్వత్రా శుభదాయకంగా ఉంటుందని నమ్మకం. మరోవైపు దీన్నే దేవ దీపావళిగానూ, త్రిపురి పూర్ణిమగానూ పిలుస్తారు. కార్తికేయుడు, తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి అని, దేవతలను హింసిస్తున్న తారకాసురుడు మరణించాడన్న సంతోషంతో ప్రజలు దీపాలు వెలిగించి సంబురాలు చేసుకున్న రోజే దేవ దీపావళి అంటారని మహాభారతం చెబుతోంది. త్రిపురాసురుడి సంహారం తర్వాత రాక్షసుల పాలన అంతమైందన్న ఆనందంలో పరమేశ్వరుడు తాండవం చేశారని ప్రతీతి.
పరమ పవిత్రమైన రోజున ఉసిరి దానం చేస్తే లక్ష్మీకటాక్షం
ఈ పవిత్ర రోజున దీపం వెలిగిస్తే సకల పాప హరణమంటారు. మరికొందరు ఈ విశిష్టత కలిగిన రోజున సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు. మరోవైపు కార్తీక మాసంలో ఉసిరి దీపం పెడితే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఉసిరి కాయతో దీపం పెట్టడం అంటే లక్ష్మీదేవిని, పరమేశ్వరుడి నిలయంలో వెలుగులు వెలిగించినట్టని అర్థం. కార్తీక పౌర్ణమి రోజు శివుడి సమక్షంలోనే ముక్కోటి దేవతలు ఆశీనులవుతారని, ఫలితంగా పరమేశ్వరుడి ముందు ఉసిరి దీపాన్ని పెడితే దరిద్రాలన్నీ హరించుకుపోతాయని విశ్వాసం. పౌర్ణమి రోజున ఉసిరి దీపం పెట్టడం మాత్రమే కాదు ఆ ఉసిరిని దానం చేయడమూ పుణ్య కార్యమని భక్తుల నమ్మకం. ఉసిరి దానం చేసిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని విశ్వాసం.