Kisan Diwas 2023: నేడు రైతు దినోత్సవం.. ఏ ప్రధాని జయంతి రోజున జరుపుకుంటారు?
Kisan Diwas 2023: భారతదేశంలో రైతుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న జరుపుకుంటారు. దేశానికి రైతులు చేస్తున్న సేవ, వారి అవసరాలు, ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలపై చర్చించేందుకు రైతు దినోత్సవం రోజున సదస్సులు, కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యవసాయ ఆధారితమైన భారత్‌లో రైతుల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎండ, వాన, చలికి లెక్కచేయకుండా రైతులు 24గంటలు దేశానికి ఆహారం అందించేందుకు శ్రమిస్తారు. దేశంలోని ప్రజలకు ఆహారాన్ని అందించేందుకు నిరంతరం శ్రమించే రైతులు గిట్టుబాటు ధర లేక.. దిగుబడి సరిగా రాక.. పెట్టుబడులు వంతు కూడా రాబడి రాక.. ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో జాతీయ రైతు దినోత్సవాన్ని దేశంలో ఎందుకు జరుపుకుంటున్నారు? దీనికి కారకులైన మాజీ ప్రధాని ఎవరో తెలుసుకుందాం.
మాజీ ప్రధాని చరణ్ సింగ్ జయంతి రోజున..
మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జయంతి సందర్భంగా జాతీయ రైతుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. చౌదరి చరణ్ సింగ్ 1979 నుంచి 1980 వరకు దేశానికి సేవ చేశారు. ప్రధానిగా ఉన్నది తక్కువ కాలమే అయినా.. దేశంలోని రైతుల పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రయత్నించారు. దీంతో పాటు వారికి సాధికారత కల్పించాలనే లక్ష్యంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఆయన సేవలకు గుర్తుగా.. 2001లో భారత ప్రభుత్వం చౌదరి చరణ్ సింగ్ కృషిని గౌరవిస్తూ డిసెంబర్ 23ని జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది. జాతీయ రైతుల దినోత్సవాన్ని సాధారణంగా దేశంలోని అన్ని వ్యవసాయ ఆధారిత రాష్ట్రాల్లో జరుపుకుంటారు. రోజున దేశంలోని అనేక ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తారు.