తేనేతుట్టెను చూస్తే అనిజీగా అనిపించిందా? ట్రైపోఫోబియా కావచ్చు
ఒకేచోట చిన్నచిన్న రంధ్రాలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటివల్ల కొంతమందికి ఇబ్బంది కలుగుతుంటుంది. ఒక్కసారిగా వాళ్ళ మనసులో అదోరకమైన జుగుప్స కలుగుతుంది. దాన్ని ట్రైపోఫోబియా అంటారు. తేనెతుట్టెను, సూర్యపువ్వు విత్తనాలను, చిన్నచిన్న విత్తనాలుండే మేడిపండు లాంటి పండ్లను, స్పాంజ్ ని చూసినా కూడా జుగుప్స కలుగుతుంది. ఈ మధ్య ప్యారిస్ ఫ్యాషన్ వీక్ లో డోజా క్యాట్ ధరించిన డ్రెస్, చాలామందికి ట్రైపోఫోబియాను కలిగించింది. ట్రైపోఫోబియాను యాంగ్జాయిటీ డిజార్డర్ గా చెప్పవచ్చు. ఒకానొక అధ్యయనం ప్రకారం 17శాతం మంది పిల్లలు, పెద్దవాళ్ళలో ఎంతోకొంత ట్రైపోఫోబియా అనేది ఉంటుందని తెలిసింది. ఈ డిజార్డర్ హాని చేయదు కానీ అనారోగ్య సమస్యలైన ఒత్తిడి, వికారం, తలనొప్పులు, గుండె వేగం పెరగడం వంటి సమస్యలకు దారితీస్తుంది.
ట్రైపోఫోబియా రావడానికి కారణాలు, ట్రీట్ మెంట్ విధానాలు
ఏదైనా చిన్న చిన్న రంధ్రాలున్న వస్తువు దగ్గరకు ఒక మనిషి వచ్చినపుడు లేదా ఒకేరకమైన వస్తువులు గుంపుగా ఒకే దగ్గర ఉన్నప్పుడు ట్రైపోఫోబియా కలుగుతుంది. చిన్నచిన్న రంధ్రాలను చూసినపుడు చర్మం మీద దురద కలిగినట్టు, పామును చూసినట్టు అంతెత్తున ఎగిరిపడతారు. కొన్నికొన్ని సార్లు దృష్టిలోపం వల్ల కూడా ట్రైపోఫోబియా కలుగుతుంది. లక్షణాలు: ట్రైపోఫోబియా వల్ల చలిపుట్టడం, నోరు ఎండిపోవడం, అదోరకమైన ఆందోళన, విపరీతమైన చెమటలు, గుండెవేగం పెరగడం లక్షణాలుగా కనిపిస్తాయి. ట్రీట్ మెంట్: ట్రైపోఫోబియాను అధిగమించడానికి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ వాడతారు. దీనిలో మానసిక శాస్త్రవేత్తలు చిన్నచిన్న రంధ్రాలున్న వస్తువులను చూపించి భయం పోయేలా చేస్తారు. హిప్నాటిజం ద్వారా మనసుకు విశ్రాంతినిచ్చి ట్రైపోఫోబియా నుండి మానసిక వైద్యులు బయటపడేస్తారు.