రోజువారి పనుల్లో ఒత్తిడి ఫీలవుతున్నారా? మీ రోగనిరోధక శక్తి తగ్గిపోయి ఎదురయ్యే సమస్యలు
రోజుల తరబడి ఒత్తిడిని ఎదుర్కొంటున్న వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. అది ఒక్కోసారి క్యాన్సర్ కి దారి తీసే అవకాశం ఉంది. ఒత్తిడితో ఇమ్యూనిటీ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని యుఎస్ కి చెందిన దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం అధ్యయనంలోతేలింది. రోజువారి ఒత్తిళ్ళు, భయంకరమైన సంఘటనలు, పని ఒత్తిడి, వివక్ష మొదలగునవి మనిషిలోని రోగనిరోధక శక్తి, వయసును తగ్గిస్తాయి. అంటే శరీరంలోని తెల్ల రక్తకణాలు దెబ్బతింటాయి తద్వారా వాటికి రోగ కారక సూక్ష్మక్రిములపై పోరాడే శక్తి ఉండదు. అప్పుడు చాలా సులభంగా అనేక వ్యాధులకు గురి కావాల్సి ఉంటుంది. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ రోగనిరోధక వ్యవస్థ పనిచేసే తీరు తగ్గుతుంది. ఈ పరిస్థితిని ఇమ్యూనోసెనీసెన్స్ అని అంటారు.
క్యాన్సర్ రిస్క్, గుండె సంబంధ వ్యాధులు
వృద్ధాప్యంలో వచ్చే సమస్యలను పక్కన పెడితే వయసులో ఉన్నప్పుడు తీవ్ర ఒత్తిళ్ళకు గురైతే అది రోగనిరోధక వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది. అది క్యాన్సర్ కి దారి తీసే అవకాశం ఉంది. ఇంకా గుండె సంబంధ రక్తనాళాల్లో ఇబ్బందులు ఏర్పడటం జరుగుతుంటుంది. 50ఏళ్ళకు పైబడ్డ 5744మందిపై వీళ్ళు సర్వే చేసారు. అందులో జాబ్ లో పని ఒత్తిడి, సమాజంలో ఒత్తిడి, రోజువారి జీవితంలో ఎదురయ్యే సంఘటనల గురించి ఒక ప్రశ్నాపత్రం ఇచ్చారు. ఆ తర్వాత వీళ్లనుండి రక్తాన్ని కూడా సేకరించారు. ఆ రక్తాన్ని లేజర్ లో పరిశీలిస్తే ఎక్కువ ఒత్తిడి కలిగి ఉన్న వారి రక్తంలో రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంది. ఒత్తిడి లేని వారి రక్తంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంది.