ఇంట్లోనే తయారు చేసుకోగలిగే చుండ్రును పోగొట్టే షాంపూలు
చలికాలంలో జుట్టుకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. చుండ్రు, దురద, వెంట్రుకలు పొడిబారిపోవడం మొదలగు సమస్యలు ఈ కాలంలో వస్తాయి. వీటిని పోగొట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అయినా కూడా కొన్నిసార్లు చుండ్రును పోగొట్టుకోవడ కష్టంగా మారుతుంది. ప్రస్తుతం జుట్టుకు సంబంధించిన సమస్యలను దూరం చేసే షాంపూలను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దోసకాయ షాంపూ: దోసకాయను ముక్కలుగా కోసి అందులోని రసం బయటకు వచ్చేలా ఒక సన్నని వస్త్రంలో వేసి గట్టిగా పిండాలి. ఆ రసానికి నిమ్మరసం కలిపి, ఆ మిశ్రమాన్ని జుట్టుకు మర్దన చేసుకోవాలి. 15నిమిషాల తర్వాత సాధారణ నీళ్ళతో జుట్టును కడుక్కోవాలి. లేదా స్నానం చేసినా సరిపోతుంది. దోసకాయలోని పోషకాలు జుట్టును సురక్షితంగా ఉంచుతాయి.
మరికొన్ని షాంపూలను ఇంట్లో తయారు చేసుకునే పద్దతులు
గుడ్డు పచ్చసొన: పచ్చసొన తీసుకుని దానికి కొంచెం కొబ్బరిపాలను, కలబంద రసాన్ని కలిపి మిశ్రమంలాగా చేసి జట్టుకు పట్టించుకోవాలి. 5నిమిషాల తర్వాత స్నానం చేయాలి. కుంకుడు షాంపూ: శీకాకాయ, కుంకుడు గింజలు, మెంతులను నీళ్లలో 10నిమిషాలు మరిగించాలి. చల్లారాక వడబోసి తడిజుట్టుకు మర్దన చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత తలను కడుక్కుంటే మంచిది. తేనె షాంపూ: తేనె, కలబంద, పిప్పర్ మెంట్ ఆయిల్ ని ఒకేదగ్గర కలిపి మిశ్రమం తయారు చేసి తడిజుట్టుకు మర్దన చేసుకోవాలి. నిమిషం తర్వాత తలస్నానం చేయండి. సహజ సిద్ధంగా, ఇంట్లో తయారు చేసుకునే ఈ షాంపూల వల్ల జుట్టు సంబంధిత సమస్యలు దూరమవుతాయి. వీటి పదార్థాల్లోని పోషకాలు శిరోజాలకు మేలు చేస్తాయి.