LOADING...
Bangalore : ఒక్క గ్యాస్‌ సిలిండర్‌ లేకుండానే లక్షల మందికి భోజనం.. ఆ కిచెన్ లో ప్ర‌త్యేక‌త ఇదే!
ఒక్క గ్యాస్‌ సిలిండర్‌ లేకుండానే లక్షల మందికి భోజనం.. ఆ కిచెన్ లో ప్ర‌త్యేక‌త ఇదే!

Bangalore : ఒక్క గ్యాస్‌ సిలిండర్‌ లేకుండానే లక్షల మందికి భోజనం.. ఆ కిచెన్ లో ప్ర‌త్యేక‌త ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 14, 2026
11:07 am

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరులో వంట గ్యాస్ కొరతతో అనేక రెస్టారెంట్లు, హాస్టళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయితే అక్కడి ఒక సామాజిక సంస్థ మాత్రం గ్యాస్ సిలిండర్లపై ఆధారపడకుండా వేలమందికి భోజనం అందిస్తూ ప్రత్యేకంగా నిలుస్తోంది. బెంగళూరుకు చెందిన డా. తేజస్విని అనంత్‌కుమార్‌ నాయకత్వంలోని 'అదమ్య చేతన' ఎన్జీఓ నిర్వహిస్తున్న 'అన్నపూర్ణ సెంట్రల్ కిచెన్' ఇందుకు మంచి ఉదాహరణగా నిలుస్తోంది.

Details

గ్యాస్ సిలిండర్ లేకుండానే లక్షల మందికి భోజనం

సుమారు పద్దెనిమిదేళ్లుగా ఈ కిచెన్‌లో ఒక్క గ్యాస్ సిలిండర్ కూడా వినియోగించకుండా వంటలు చేస్తున్నారు. ఇక్కడ రోజూ సుమారు రెండు లక్షల మంది పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. అదేవిధంగా వేలాది మందికి ప్రతిరోజూ అన్నదానం కూడా చేస్తున్నారు. మొత్తం వంట ప్రక్రియను పునరుత్పాదక ఇంధనాల ఆధారంగా నిర్వహించడం ఈ కిచెన్ ప్రత్యేకత.

Details

బయోమాస్‌, అగ్రి వ్యర్థాలతో వంట

సాధారణంగా పెద్ద కిచెన్లలో భారీగా వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. వాటిని తరలించడం కూడా మున్సిపాలిటీకి భారంగా మారుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా తేజస్విని అనంత్‌కుమార్ కొత్త ఆలోచన తీసుకొచ్చారు. కిచెన్‌లో వచ్చే వ్యర్థాలను ఉపయోగించి బయోమాస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ధాన్యపు పొట్టు, గడ్డి, కొబ్బరి చిప్పలు వంటి వ్యవసాయ వ్యర్థాలతో తయారయ్యే బ్రికెట్లను ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. వీటి సాయంతో భారీ బాయిలర్లలో టన్నుల కొద్దీ బియ్యాన్ని ఆవిరిపై వండుతున్నారు.

Advertisement

Details

సౌరశక్తితో విద్యుత్‌, నీటి రీసైక్లింగ్

విద్యుత్ అవసరాల కోసం సౌరశక్తిని వినియోగిస్తున్నారు. వంటలో ఉపయోగించిన నీటిని వృథా చేయకుండా రీసైకిల్ చేసి మొక్కలకు ఉపయోగిస్తున్నారు. బాయిలర్ శుభ్రం చేసిన నీటిని ఫిల్టర్ చేసి వాహనాలను కడగడానికి వాడుతున్నారు. ఈ విధానాలతో ఈ కిచెన్ పదిహేనేళ్ల క్రితమే "జీరో గార్బేజ్ యూనిట్"గా గుర్తింపు పొందింది.

Advertisement

Details

మహిళల సాధికారతకు కార్యక్రమాలు

'అదమ్య చేతన' సంస్థ సామాజిక సేవలో కూడా ముందుంది. మహిళల సాధికారత కోసం వృత్తి శిక్షణ, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు పదివేల స్టీల్ ప్లేట్లు, గ్లాసులతో "ప్లేట్ బ్యాంక్" ఏర్పాటు చేసి అవసరమైన వారికి ఉచితంగా అందిస్తోంది. అదేవిధంగా గ్రీన్ బెంగళూరు లక్ష్యంతో మొక్కలు నాటే కార్యక్రమాలను కూడా చేపడుతోంది. ఇలా ప్రారంభమైంది సంస్థ అనంత్ కుమార్ తన తల్లి జ్ఞాపకార్థం 1997లో "ఆహారం, అక్షరం, ఆరోగ్యం" అనే మూడు ప్రధాన లక్ష్యాలతో 'అదమ్య చేతన' అనే ఎన్జీఓను ప్రారంభించారు. డా. తేజస్విని అనంత్‌కుమార్ ఈ సంస్థకు సహ వ్యవస్థాపకురాలు, ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. అనంతరం 2008లో ప్రారంభమైన అన్నపూర్ణ కిచెన్ కార్యకలాపాలను ఆమె స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

Details

భారీగా గ్యాస్ సిలిండర్ల ఆదా

బెంగళూరుతో పాటు మొత్తం ఐదు వంటశాలలతో ఈ అన్నపూర్ణ కిచెన్ పనిచేస్తోంది. రోజుకు సుమారు 3 టన్నుల బయోమాస్ బ్రికెట్లు వినియోగిస్తున్నారు. ఇది దాదాపు 120 గ్యాస్ సిలిండర్లకు సమానమైన ఇంధనం. ఈ విధంగా బయో ఇంధన వినియోగంతో సంవత్సరానికి 12,500కు పైగా గ్యాస్ సిలిండర్ల వినియోగాన్ని తగ్గిస్తున్నారు. డా. తేజస్విని అనంత్‌కుమార్ మాట్లాడుతూ మా కిచెన్ నుంచి ఇప్పటివరకు ఒక్క వ్యర్థం కూడా బయటకు వెళ్లలేదు. ప్రారంభంలో కొంత కష్టంగా అనిపించినా తర్వాత ఇది ఎంతో సౌకర్యంగా మారింది. ఈ విధానం గురించి ఆసక్తి ఉన్న వారికి శిక్షణ కూడా ఇస్తున్నామ‌ని తెలిపారు. స్వీయ ఇంధనంతో స్వావలంబన సాధించి వేలమందికి ఆహారం అందిస్తున్న ఈ ప్రయత్నం నిజంగా ఆదర్శంగా నిలుస్తోంది.

Advertisement