pani puri: నాగ్‌పూర్'లో పానీపూరీ ప్రియులకు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు.. వెరైటీ ఆఫర్లు
ఈ వార్తాకథనం ఏంటి
చిరుతిళ్లలో పానీపూరీని ఇష్టపడని వారు చాలా అరుదు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ ఎంతో ఆసక్తిగా తింటుంటారు.
దీనిని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు వ్యాపారులు కొత్త తరహా ఆలోచనలతో ముందుకు వస్తుంటారు.
విభిన్న రుచులతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు వారు తమ వంతు ప్రయత్నాలు చేస్తుంటారు.
మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన విజయ్ అనే పానీపూరీ వ్యాపారి ఈ విషయంలో మరో కొత్త మెలిక పెట్టాడు.
సాధారణంగా రుచికరమైన పానీపూరీలను విక్రయించడమే కాకుండా, వినూత్నంగా సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు, ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తెచ్చాడు.
ప్రతి సారి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా జీవితాంతం ఎప్పుడైనా, ఎంతైనా ఉచితంగా తినాలనుకునే వారికి ఓ ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టాడు.
వివరాలు
రూ.99,000 కట్టండి..తినండి.. జీవితాంతం ఎప్పుడైనా, ఎంతైనా..
దీని కోసం రూ.99,000 చెల్లించాలని పేర్కొన్నాడు. ఇది వినగానే ఆశ్చర్యంగా అనిపించినా, ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని ఆయన తెలిపారు.
అంతేకాదు, అన్ని వర్గాల వారికి ఉపయోగపడేలా మరిన్ని ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నాడు.
'మహా కుంభ్' ఆఫర్ కింద ఒక వ్యక్తి వరుసగా 40 పానీపూరీలు తినగలిగితే కేవలం రూ.1 మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని చెప్పాడు.
అలాగే, 'లాడ్లీ బహెన్ యోజన' కింద మహిళలు రూ.60 చెల్లిస్తే ఎన్ని తినగలిగితే అన్ని తినొచ్చని తెలిపారు.
ఇప్పుడందరూ ఓటీటీలకు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు తీసుకుంటున్నట్టు, విజయ్ పానీపూరీలకూ నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ఆలోచనను తీసుకొచ్చాడు.
రూ.195 చెల్లిస్తే నెల మొత్తం అపరిమితంగా పానీపూరీ తినే అవకాశాన్ని కల్పించాడు.