Monkey Jack (Artocarpus Lacucha): పోషక విలువలతో పాటు ఔషధ విలువలు గల పండు గురించి విన్నారా?
మంకీ జాక్ అనేది వ్యవసాయానికి అత్యంత అనుకూలమైన పంట. ఈ చెట్లు ఏడాదంతా ఆకులతో పచ్చగా, నిలువుగా పెరుగుతాయి. మంకీ జాక్ కలప చాలా విలువైనది, ఇది పరికరాలు, వివిధ వస్తువుల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. ఈ చెట్ల పండ్లు పోషకాహారంతో పాటు ఔషధ గుణాలు కలిగి ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉష్ణోగ్రతలు అధికమవుతున్న ప్రస్తుత కాలంలో, ఆగ్రో ఫారెస్ట్రీ పద్ధతిలో మంకీ జాక్ చెట్లను సాగు చేయడం వల్ల ఇవి అందించే పాక్షిక నీడలో స్వల్పకాలిక పంటలను పండించుకోవచ్చు. ఈ చెట్లు వ్యవసాయానికి సుస్థిరతను అందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కలప కోసం పెంచే రైతులు, పండ్ల ద్వారా అదనపు ఆదాయం పొందగలరు.
మంకీ జాక్ పండ్లు: పోషకాలు, ఔషధ ప్రయోజనాలు
మంకీ జాక్ పండ్లు నేరుగా తినడానికి అనువుగా ఉంటాయి. పచ్చళ్లు, చట్నీలు, సాస్‌లు తయారు చేయవచ్చు. ఈ పండ్ల గుజ్జు కాలేయ జబ్బులు తగ్గించడంలో సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. వయోభారంతో చర్మంపై వచ్చే ముడతల చికిత్సలో కూడా దీన్ని ఉపయోగిస్తారు. జార్కండ్‌లో గిరిజన వైద్యంలో ఈ చెట్ల వినియోగం విస్తృతంగా కనిపిస్తుంది.
చెట్లు: పర్యావరణానికి మేలు, ఆర్థిక ప్రయోజనం
మంకీ జాక్ చెట్లు 15 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. ఇవి మట్టిని పరిరక్షించడం, జీవవైవిధ్యాన్ని పెంపొందించడం వంటి పర్యావరణ ప్రయోజనాలను అందిస్తాయి. ఈ చెట్ల ఆకులు పశుగ్రాసంగా చాలా ఉపయోగకరమైనవి. ప్రొటీన్ అధికంగా ఉండటం వల్ల పశువుల పాల ఉత్పత్తిని మెరుగుపరచడానికి దోహదపడతాయి. ఈ చెట్ల బెరడు, కలప నిర్మాణ రంగంలో, ఫర్నీచర్ తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు.
ఆర్థిక ప్రయోజనాలు: రైతులకు ఆదాయ వనరులు
మంకీ జాక్ పండ్ల ధర కిలోకు ₹175 వరకు పలుకుతుంది. ఈ చెట్ల పచ్చి ఆకులు, పొడి పశుగ్రాసం రూపంలో ఆదాయం అందిస్తాయి. పైగా,రసాయనాల వినియోగాన్ని తగ్గించి,సేంద్రియ వ్యవసాయానికి ఈ చెట్లు సహాయపడతాయి. మంకీ జాక్ పెంపకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఈ చెట్లు భూతాపోన్నతితో ఏర్పడే ప్రతికూల పరిస్థితులను తట్టుకోగల స్వభావాన్ని కలిగి ఉంటాయి. అనావృష్టి, నిస్సారమైన నేలల్లో కూడా ఇవి విజయవంతంగా పెరుగుతాయి. ప్రభుత్వం మంకీ జాక్ పెంపకాన్ని ప్రోత్సహిస్తే పేదరిక నిర్మూలన, పశుగ్రాస కొరత నివారణ, పశు ఆరోగ్య మెరుగుదల,వ్యవసాయదారుల ఆదాయ వృద్ధి వంటి అనేక ప్రయోజనాలు పొందవచ్చు. మొత్తంగా మంకీ జాక్ చెట్లు పర్యావరణానికీ,ఆర్థికానికీ,ఆరోగ్యానికీ అనేక మేలుచేస్తాయి.ఈ చెట్ల పెంపకం ఆహార భద్రతకు,పర్యావరణ సమతుల్యతకు కీలకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.