
Yoga: యోగాసనాల వల్ల పూర్తి ఫలితం పొందాలంటే.. ఈ పొరపాట్లు చేయకండి ..!
ఈ వార్తాకథనం ఏంటి
మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారా? టెన్షన్ నుంచి వెంటనే ఉపశమనం పొందాలనుకుంటున్నారా? అలసటతో ఉన్నశరీరానికి తాజాగా ఉల్లాసాన్ని ఇవ్వాలనుకుంటున్నారా? అటువంటి పరిస్థితులన్నింటికీ ఒకే సమాధానం యోగా అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే యోగాసనాల వల్ల పూర్తి ఫలితం పొందాలంటే.. చేసే క్రమంలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తపడడం ముఖ్యం అంటున్నారు. చాలామంది తెలిసీ తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. వీటి వల్ల యోగా చేసిన ఫలితం దక్కకుండా పోతుంది. అంతర్జాతీయ యోగా దీనోత్సవం సందర్భంగా, యోగా చేసే సమయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు చూద్దాం.
వివరాలు
ఇలా చేస్తే నిరుపయోగమే!
యోగా అనేది కేవలం భౌతిక ఆసనాల సమాహారం కాదు. దీన్నీ మానసికంగా, శారీరకంగా సమతుల్యంగా చేస్తున్నప్పుడే నిజమైన ప్రయోజనం లభిస్తుంది. కానీ చాలామంది ఈ విషయాన్ని పట్టించుకోకుండా కేవలం ఆసనాలపైనే దృష్టిపెట్టి, ఊపిరి పీల్చడం, వదలడం లాంటివి చేస్తుంటారు. ఒక్కసారిగా గట్టిగా శ్వాస తీసుకుని వెంటనే వదలడం లాంటి చర్యలు చేస్తారు. దీనివల్ల ఆసనానికి అనుకూలంగా ఉండాల్సిన శ్వాసక్రియ తప్పిపోయి, అంతకంతకూ ఫలితం తగ్గిపోతుంది. అందువల్లే ప్రతి ఆసనం వేస్తున్నప్పుడు దానికి తగిన ప్రక్రియలో, సున్నితంగా ఊపిరి తీసుకుని వదిలే పద్ధతిని పాటించాలి. నిపుణులు సూచించిన విధంగా శ్వాసక్రియను అనుసరిస్తే, శరీరానికి ఆరోగ్యం, మనసుకు ప్రశాంతత కలుగుతుంది.
వివరాలు
సొంత ప్రయత్నాలొద్దు...
కొన్ని ఆసనాలు చూసేలా ఒకే విధంగా అనిపించవచ్చు కానీ వాటి తత్వం, భంగిమలు వేరు. కొంతమంది ఇదే అంటూ అన్ని ఆసనాలను ఒకే విధంగా చేసే ప్రయత్నం చేస్తారు. ఇది యోగాకు నష్టాన్ని కలిగించవచ్చు. ప్రతి ఆసనానికి తనదైన శైలిలో ఆచరణ అవసరం. అంతేకాకుండా, యోగాను ఇంట్లో ఎవరి సలహా లేకుండా తాము చేసేస్తే సరిపోతుందనుకుంటారు. కానీ తగిన సాంకేతికత లేకపోతే కండరాలపై ఒత్తిడి, నాడులపై సమస్యలు ఏర్పడి నొప్పులు వస్తాయి. కాబట్టి నిపుణుల పర్యవేక్షణలో ఆసనాలు ఆచరించడం అత్యంత అవసరం.
వివరాలు
యోగాకు ముందు వార్మప్ తప్పనిసరి
వ్యాయామం చేసే ముందు వార్మప్ చేయడం ఎలా అవసరమో, యోగాకు ముందు కూడా తగిన వార్మప్ చేయకపోతే శరీరం అంతగా సహకరించదు. ఈ పరిస్థితుల్లో ఆసనాలు చేయడం కష్టంగా అనిపించి, ఎప్పుడొకప్పుడు యోగా పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. కనుక యోగా చేయడానికి కనీసం 30 నిమిషాల ముందు తగిన విధంగా శరీరాన్ని సడలించే వర్కౌట్ చేయాలి. దీంతో శరీర ఫ్లెక్సిబులిటీ పెరిగి ఆసనాలు బాగా చేయగలుగుతారు.
వివరాలు
తొందరపడటం మంచిది కాదు
యోగాసనాలు చేస్తూ సమయం ఎక్కువవుతోందని కాస్త తొందరపడితే ప్రయోజనం లభించదు. కొంతమంది తక్కువ సమయంలో ఎక్కువ ఆసనాలు పూర్తి చేయాలని తొందరపడతారు. ఈ విధానంలో గాయాల ప్రమాదం పెరుగుతుంది. అందుకే ప్రతి ఆసనాన్ని నెమ్మదిగా, ఆస్వాదిస్తూ, శ్రద్ధగా చేయాలి. ఒక్క ఆసనం పూర్తయిన తర్వాత, ఆదరాబాదరాగా కాకుండా కండరాలకు విశ్రాంతినివ్వడం వల్ల తర్వాతి ఆసనం మెరుగ్గా చేయవచ్చు. యోగా పట్ల ప్రేమ, ఆసక్తి మరింత పెరుగుతుంది.
వివరాలు
ఇది కూడా గుర్తుపెట్టుకోండి:
ప్రారంభ దశలో సులభమైన ఆసనాలే ఉత్తమం యోగాను కొత్తగా ప్రారంభించిన వారు మొదటి 45 రోజులు కఠినమైన ఆసనాల జోలికి పోకుండా, సులభమైన ఆసనాలను మాత్రమే ఆచరించాలి. లేదంటే తొందరగా అలసిపోయే అవకాశం ఉంది. సౌకర్యవంతమైన దుస్తులు యోగా చేసే సమయంలో దుస్తులు నిగుదిగా ఉండకూడదు, మితంగా వదులుగా ఉండాలి. శరీరచలనం సాఫీగా సాగడానికి ఇది అవసరం. ఆరోగ్య సమస్యలున్న వారు జాగ్రత్త గుండె సంబంధిత వ్యాధులు లేదా ఇతర సమస్యలున్నవారు కఠినమైన ఆసనాలు చేయకూడదు. చేస్తే తప్పనిసరిగా నిపుణుల పర్యవేక్షణలో ఉండాలి. వారు సూచించే సులభమైన ఆసనాలకే పరిమితం కావాలి.
వివరాలు
యోగా అనేది ఒక జీవనశైలి
యోగాసనాలు శరీరాన్ని మానసికంగా, శారీరకంగా శక్తివంతంగా చేస్తాయి. అయితే యోగాలో నిజమైన ప్రయోజనం పొందాలంటే ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పాటించాలి. ఎలాంటి నిర్లక్ష్యమూ, తొందరపాటు లేకుండా క్రమశిక్షణతో ఆసనాలు చేస్తే, మన ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరచుకోవచ్చు. యోగా అనేది ఒక జీవనశైలి - దానిని గౌరవంతో, నియమాలతో ఆచరించాలి.