ప్రేరణ: పొరపాట్లు జరిగినప్పుడే నీలోని కొత్తదనం బయటకు వస్తుంది
మీలో క్రియేటివిటీ పెరగాలంటే మీరు చేస్తున్న పనుల్లో కొత్తదనం కనిపించాలి. కొత్తదనాన్ని మీ పనిలోకి తీసుకురావడానికి కొంత టైమ్ పడుతుంది. కొన్ని పొరపాట్లు జరుగుతాయి. అయినా కూడా ప్రయత్నం చేస్తే మీలోని క్రియేటివిటీ బయటపడుతుంది. థామస్ అల్వా ఎడిసన్ మొదటి సారి తయారు చేసిన బల్బు వెలగలేదు. రకరకాలుగా ప్రయత్నించాడు. చాలాసార్లు ఫెయిల్ అయ్యాడు. ఫెయిలైన ప్రతీసారీ కొత్తగా ప్రయత్నించడం మొదలెట్టాడు. చివరికి సక్సెస్ అయ్యాడు. కొత్తదనం కోసం పరితపిస్తున్నప్పుడు పొరపాట్లు జరగడం సహజమే. పొరపాట్ల గురించి పట్టించుకోకుండా ముందుకు వెళితేనే మీలోని క్రియేటివిటీ ప్రపంచానికి తెలుస్తుంది. లేదంటే నీలోని టాలెంట్, నీలోనే ఉండిపోయి గుంపులో ఒకడిగా మిగిలిపోతావు.
కొత్తగా ఆలోచిస్తేనే గుంపు నుండి బయటకు వస్తారు
ఈ ప్రపంచమనే గుంపు నుండి బయటకు వచ్చి ప్రత్యేకంగా నిలబడాలంటే కొత్తగా ఆలోచించాలి. కొత్తదనం వైపు జీవితం సాగించాలి. ఈ ప్రాసెస్ లో పొరపాట్లు జరుగుతాయి. భరించాలి. ఏ పొరపాటు జరగకుండానే ఆపిల్ ఫోన్ తయారయ్యిందా? ఏ పొరపాట్లు చేయకుండానే ఛాట్ జీపీటీని సృష్టించారా? ఛాట్ జీపీటీలో ఇప్పటికీ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని అంటున్నారే, అయినా కూడా దాని యజమానులు, తమని తాము డెవలప్ చేసుకుంటూ ముందుకు వస్తున్నారు కదా. పొరపాట్లు అనేవి సహజం. అవి వస్తూనే ఉంటాయి. మీరు వాటిని సీరియస్ గా తీసుకుని కొత్తగా పని చేయడం నుండి పారిపోకుండా ఉన్నప్పుడే మీలోని కొత్త నైపుణ్యం బయటకు వస్తుంది.