ప్రేరణ: ఒత్తిడిని పక్కకు నెట్టి ప్రశాంతంగా మారినపుడే విజయం నీ సొంతమవుతుంది
ప్రస్తుత ప్రపంచంలో ఒత్తిడి అనేది సహజంగా మారిపోయింది. ఒత్తిడి లేనివారు టార్చ్ లైట్ పట్టుకుని వెతికినా కనిపించట్లేదు. పని, బంధాలు, ఆర్థిక కారణాల వల్ల ఒత్తిడి పెరుగుతోంది. ఒత్తిడిలో మీరున్నప్పుడు సరిగా ఆలోచించలేరు. ఆలోచించలేకపోతే సరైన నిర్ణయాలు తీసుకోలేరు. నిర్ణయాలు సరిగ్గా లేకపోతే నష్టం వస్తుంది. ఆ నష్టం మళ్ళీ ఒత్తిడిని పెంచుతుంది. అందుకే ఒత్తిడిని దూరం చేసుకోవాలి. అసలు ఒత్తిడి ఎందుకు కలుగుతుంది? దానికి గల కారణాలను తెలుసుకుని మనసును ప్రశాంతంగా ఉంచే మార్గాలను వెతుక్కోవాలి. ఒత్తిడి అనేది మీ జీవితంలో భాగమైపోతే ఆనందం అనేది మీకు దూరంగా పారిపోతుంది. ఒత్తిడి ఉంటేనే సరిగ్గా పనిచేయగలమని కొందరు అంటారు. పని చేస్తారు నిజమే, ఆ పనివల్ల పాడైన ఆరోగ్యాన్ని ఎవరు తీసుకురాగలరు?
పట్టించుకుంటేనే సమస్య, వదిలేస్తే ఆనందమే
అస్సలు ఒత్తిడి లేకుండా ఎవ్వరూ జీవించలేరు, అది నిజమే. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే, ప్రతీదానిలో ఒత్తిడి ఫీల్ కావడమే. ప్రతీ చిన్న విషయాన్ని మనసుకు తీసుకుని గంటలు గంటలు ఆలోచించడమే అసలు సమస్య. చాలామంది చిన్న చిన్న విషయాలను కూడా విపరీతంగా పట్టించుకుంటారు. జనరల్ గా భార్యభర్తల బంధంలో చిన్న చిన్న విషయాల్లో గొడవలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఆ గొడవలు అవతలి వారికి చాలా సిల్లీగా ఉంటాయి. వాళ్ళకు మాత్రమే పెద్దగా కనిపించి ఇద్దరినీ విడగొట్టేదాకా తీసుకెళ్తాయి. కొన్ని విషయాలను చూసీచూడనట్టుగా వదిలేసినపుడే జీవితం ఆనందంగా ఉంటుంది. అన్నింటినీ పట్టుకుంటే ఆనందం మిగలకుండా పోతుంది.