ప్రేరణ: పెద్ద విజయం వైపు సాగే ప్రయాణంలో చిన్న విజయాలను సెలెబ్రేట్ చేసుకోవడం మర్చిపోకండి
ఏదో ఒకటి సాధించకపోతే ఈ జీవితం ఎందుకు? మనిషిగా పుట్టినందుకు ఏదైనా గొప్పది సాధించాలని ఎంతోమంది చెబుతారు. గొప్ప కలలను కన్నప్పుడే గొప్ప పనులు చేయగలుగుతారని అంటారు. నిజమే, అయితే గొప్ప విజయం వైపు సాగే ప్రయాణంలో కొంతమంది చిన్న చిన్న విజయాలను పెద్దగా పట్టించుకోరు. ఐపీఎస్ కావాలన్న ఆలోచన నీకుంది. రేపటి నుండి దానికి ప్రిపేర్ అవ్వాలనుకున్నావ్. ఆ ఆలోచనలో భాగంగా రేపు ఉదయం 4గంటలకే నిద్రలేచి చదవడం మొదలుపెట్టావు. ఉదయం లేవడమనేది విజయమనేది చాలామంది అర్థం చేసుకోరు. ఐపీఎస్ వరకూ నీ ప్రయాణం చాలా పెద్దది. అందులో ఉదయం నిద్రలేవడం కూడా ఒక గెలుపే.
ఎనర్జీ ఎక్కించుకునేందుకు ప్రయత్నించు
అంటే, చిన్న చిన్న వాటిని సెలెబ్రేట్ చేసుకుని సంబరపడిపోయి అక్కడే ఆగిపోవాలని కాదు. పెద్ద ప్రయాణంలో వచ్చే అలసట నుండి బయటపడటానికి చిన్న విజయానికి సంతోషపడి ఎనర్జీని ఎక్కించుకోమని ఉద్దేశ్యం. మరో విషయం ఏంటంటే, చిన్న చిన్న విజయాలన్నీ కలిసి పెద్ద విజయాలకు దారి తీస్తాయి. వాటిని పట్టించుకుని మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో పక్కనోళ్ళను ప్రోత్సహించే వాళ్ళు తక్కువైపోతున్నారు. కుదిరితే విమర్శలే తప్ప ప్రోత్సాహం పెద్దగా ఉండట్లేదు. కాబట్టి నువ్వు చేరుకునే చిన్న విజయాలకు సంబరపడు. కొత్త ఉత్సాహం తెచ్చుకో. మరింత వేగంగా మరో చిన్న విజయాన్ని చేరుకుని ఏకంగా నువ్వు అనుకున్నది సాధించు.