ప్రేరణ: మీకు సందేహాలు ఎక్కువగా వస్తాయా? మీరెప్పుడు అనుకున్నది సాధించలేరు?
కీడు ఎంచి మేలు ఎంచాలని చెబుతారు. నిజమే కానీ ఇది అన్నివేళలా నిజం కాదు. ఎందుకంటే కొన్నిసార్లు కీడు జరుగుతుందేమోనన్న భయంతో మంచి అవకాశాలను కోల్పోవాల్సి వస్తుంది. అవకాశం నీ నుండి చేజారిన తర్వాత అయ్యో అంటే ఎలాంటి లాభం ఉండదు. చాలామందికి సందేహాలు ఎక్కువగా వస్తాయి. ఒక పనిచేయాలని అనుకున్నప్పుడు ఆ పని పూర్తి కాకపోతే ఎలా? మధ్యలో ఏదైనా సమస్య వస్తే ఎలా అన్న సందేహాలు వస్తుంటాయి. ఈ సందేహాల వల్ల వాళ్ళు పని మొదలుపెట్టడమే మానేస్తారు.మొదలుపెట్టని పని ఎప్పటికీ పూర్తికాదు. ఫలితంగా ఒడిపోతారు. అంటే సందేహాలు ఉండకూడదని కాదు, సందేహాలనేవి నువ్వు చేయబోయే పనికి చక్కని మార్గాన్ని చూపేలా ఉండాలి. అంతేకానీ నువ్వు వెళ్తున్న దారిని మూసేలా ఉండకూడదు.
నమ్మి పనిచేస్తే సందేహాలు రావు
సందేహాల వల్ల నువ్వు నీ పనిని మానుకోకూడదంటే ఆ పనిని నువ్వు మనస్ఫూర్తిగా నమ్మాలి. ఈ నమ్మకం సినిమా వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. తమ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకంగా చెబుతారు. అలా చెప్పిన సినిమాల్లో చాలావరకు ఫ్లాప్ అవుతుంటాయి. అయినా సరే వాళ్ళు తమ నమ్మకాన్ని కోల్పోకుండా మరో సినిమా తీసి అంతే నమ్మకంగా చెబుతారు. నిన్ను నువ్వు నమ్మడం వల్ల ఒక పనిని పూర్తిచేయగలవు. ఒకవేళ దర్శకుడు తన సినిమాను నమ్మకపోతే ఆ సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు, వచ్చే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే అపనమ్మకాలను పక్కన పెట్టి ముందుకు దూకండి.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి