ప్రేరణ: రూపం లేని రేపటి గురించి ఆలోచించడం కన్నా నీ రూపం ఉన్న ఈరోజు గురించి ఆలోచించు
చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. ఏదైనా మంచి పని స్టార్ట్ చేయాలంటే ఈరోజు మొదలుపెట్టరు. రేపు చేద్దామనుకుంటారు. కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దామన్నా, కొత్త స్కిల్ నేర్చుకుందామన్నా, కొత్తవాళ్ళతో మాట్లాడదామన్నా... అన్నింటినీ రేపటికి వాయిదా వేసుకుంటారు. ఇలా ఆలోచించే వాళ్ళకు అర్థం కావాల్సింది ఏంటంటే, వాళ్ళు కేవలం పనులను మాత్రమే వాయిదా వేయట్లేదు, తమ విజయాన్ని కూడా వాయిదా వేసుకుంటున్నారని. ప్రతీ దానికీ రేపు రేపు అనుకునే వారి జీవితంలో ఆ రేపు ఎప్పటికీ రాదు. 25ఏళ్ళ వయసులో పడాల్సిన కష్టాన్ని వాయిదా వేసి, యాభై ఏళ్ళు వచ్చాక పనిచేస్తానంటే ఎలా కుదురుతుంది. అందుకే, ఏ పని చేయాలనుకున్నా ఈరోజు నుండే మొదలుపెట్టు.
మనసుకు పట్టిన బద్దకాన్ని బద్దలు కొట్టు
నువ్వు దేని గురించైతే కలలు కంటున్నావో, ఏం జరిగితే నీ జీవితం బాగుపడుతుందని నువ్వు అనుకుంటున్నావో అలాంటి పనులు చేయడానికి సందేహించకు, ముహూర్తాలు చూడకు. రేపు అన్న మాటను నీ నోట్లోంచి, ఆ ఆలోచనను నీ మనసులోకి రానివ్వకు. మనసెప్పుడూ బద్దకంగా ఉండాలనే అనుకుంటుంది. దాని ఒళ్ళును నువ్వే విరిచి బద్దకాన్ని బద్దలు కొట్టాలి. ఈరోజు నువ్వు ఎంత తొందరగా ప్రారంభిస్తావో రేపు నువ్వు అంత తొందరగా విజయాన్ని అందుకుంటావ్. పరుగుపందెంలో ఒక రౌండ్ పూర్తి చేసిన తర్వాత జాయిన్ అయ్యేవాడు ఖచ్చితంగా చివర్లోనే ఉంటాడు. వాడు ఫస్ట్ ప్లేస్ లోకి రావాలంటే ఏదో అద్భుతం జరగాలి. ఆ అద్భుతం గురించి ఆలోచిస్తూ ఉంటే, కళ్ళముందు కనిపించే నిజాన్ని తెలుసుకోలేవు.