ప్రేరణ: నిన్న ఎలా ఉన్నా, రేపెలా ఉంటుందో తెలియకపోయినా ఈరోజు ఆనందంగా ఉండాలి
మనుషుల బాధలకు కారణం నిన్నటి గురించో లేదా రేపటి గురించో ఆలోచించడమే. చాలామంది ఇలానే ఉంటారు. నిన్న జరిగిన విషాదాన్ని తల్చుకుంటూ, ఇలా ఎలా జరిగిందని ఆలోచిస్తూ బాధపడతారు. కొంతమందేమో, రేపెలా ఉంటుందోనన్న భయంతో అనుక్షణం దిగులుగా ఉంటారు. పై రెండు ఉదాహరణల్లో ఆనందం ఎక్కడా కనిపించదు. మరి ఆనందం ఎక్కడుందీ అంటే, అది ఈరోజులోనే ఉంది. ఆ విషయాన్ని మర్చిపోయి ఆనందం తమ జీవితంలో ఇంకెప్పుడో వస్తుందని అనుకుంటూ ఈరోజును కూడా బాధల్తో గడిపేస్తారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, జరిగిపోయిన దాన్ని ఎప్పటికీ మార్చలేం. అలాగే రేపేం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఇలా జరుగుతుందని ఊహించగలమే గానీ ఇలాగే జరుగుతుందని ఎవ్వరూ చెప్పలేరు.
ఈ క్షణంలో బతకాలి
నిన్ననూ మార్చలేము, రేపేం జరుగుతుందో తెలుసుకోలేము. మరలాంటప్పుడు నిన్నటి గురించి ఆలోచించడం, రేపటి గురించి భయపడటం అనవసరమే కదా! ఒక మనిషి ఆనందంగా ఉండాలంటే ఈరోజును అనుభవించాలి. ఎందుకంటే మనుషుల చేతిలో ఈరోజు మాత్రమే ఉంటుంది. ఈ క్షణంలో బ్రతకడం తెలిసిన వాళ్ళకే ఆనందం విలువ తెలుస్తుంది. ఈ క్షణం ఆనందంగా సాగిపోతే భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఈ క్షణం కష్టంగా మారిపోతే భవిష్యత్తు మొత్తం కష్టాలే. చేస్తున్న పనిలో ఆనందం పొందితే అంతకన్నా ఆనందం ఇంకోటి ఉండదు. అందరికన్నా ఆనందంగా ఉండేది కూడా చేస్తున్న పనిలో ఆనందం పొందేవాళ్ళే.