ప్రేరణ: సమస్యలను చూసి భయపడకండి.. అవి పరిష్కారాలను చూపిస్తాయ్
ఏదైనా ఒక పనిలో వరుసగా సమస్యలు వస్తున్నట్లయితే ఆ పనిని మానేసి పక్కకు వెళ్లే వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు కూడా అలా చేస్తున్నట్లయితే ఆ అలవాటును ఇప్పుడే మానుకోండి. ఎందుకంటే పనిలో వచ్చే సమస్యలు ఆ పనిని ఏ విధంగా పూర్తి చేయాలో తెలిపే సూచనలు తప్ప మరోటి కాదని గుర్తుంచుకోండి. ఉదాహరణకు ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగాన్ని చూడండి. మొదటగా 2019లో చంద్రయయాన్-2 ప్రయోగాన్ని చేశారు. కానీ అది చంద్రుడి మీద సురక్షితంగా ల్యాండ్ కాలేకపోయింది. సాఫ్ట్ వేర్ లో ఏదో లోపం ఏర్పడి క్రాష్ అయ్యింది. అలా అయిందని చెప్పి చంద్రుడి మీదకు మరో ప్రయోగాన్ని పంపించకపోతే ఈరోజు చంద్రయాన్-3, చంద్రుడి మీద పరిశోధనలు చేసేదే కాదు.
సమస్యలు వస్తే దిగులు చెందకూడదు
చంద్రుడి మీద దిగడానికి ఏర్పడిన సమస్యను చంద్రయాన్-3 అధిగమించింది. విజయాన్ని సాధించింది. ఏ విషయంలోనైనా ఇది వర్తిస్తుంది. కొత్తగా పని మొదలుపెట్టినప్పుడు సమస్యలు ఒకదాని వెంట ఒకటి వరుసగా వస్తుంటాయి. వాటి గురించి బాధపడాల్సిన అవసరం లేదు. దిగులు చెందాల్సిన అవసరం అంతకన్నా లేదు. కొత్తలో సమస్యలు చాలా సహజం. ఇక్కడ సమస్యలు వస్తున్నాయని వేరే వైపు వెళ్తే అక్కడ సమస్యలు రావన్న గ్యారెంటీ లేదు. కాబట్టి మీకు నచ్చిన పనిలో ఎలాంటి సమస్యలున్నా వాటిని అధిగమించుకుని వాటి ద్వారా పాఠాలు నేర్చుకుని ముందుకు వెళ్లాలి. అప్పుడే జీవితంలో ఆనందం దొరుకుతుంది.