
ప్రేరణ: వయసు పెరుగుతున్నా ముడుతలు రాకుండా చేసేది నవ్వు మాత్రమే, నవ్వడం ఈరోజే స్టార్ట్ చేయండి
ఈ వార్తాకథనం ఏంటి
కాలం ఎవ్వరి కోసం ఆగదు, ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ ప్రవాహంలో నువ్వు, నేను, అందరూ ఉంటారు. అయితే కాల ప్రవాహంలో జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు మిమ్మల్ని అందంగా ఉంచేది నవ్వు మాత్రమే.
జీవితం అందంగా ఉండాలంటే నవ్వాలి. అందంగా ఉన్నప్పుడే కదా పెదాల మీదకు నవ్వొస్తుందని మీరు ప్రశ్నిస్తే, మీకు నవ్వు గురించి, జీవితం ఎక్కువ తెలియదని అర్థం.
ముందుగా అసలు నవ్వడం ఎందుకు మర్చిపోతున్నారనేది చూద్దాం.
కొందరు తమ జీవితంలో ఉత్తమమైనది సాధించేవరకు నవ్వుకు దూరంగా ఉంటారు. ఇంకొందరు సమాజం దృష్టిలో గంభీరంగా కనిపించేందుకు నవ్వడాన్ని మర్చిపోతారు.
పై రెండు సందర్భాల్లో జీవించేవారు ఎప్పటికీ ఆనందంగా ఉండలేరు. ఎందుకంటే వారు తమ కోసం జీవించట్లేదు. ఎదుటివారి కోసం బతుకుతున్నారు.
Details
ఇతర భావోద్వేగాల్లో ఎక్కువసేపు ఇరుక్కుపోయి నవ్వును దూరం చేసుకోకు
నీ ఆర్థిక పరిస్థితులు, నీ కష్టాలు, నీకున్న దుఃఖాలు ఏవీ కూడా నీ నుండి నవ్వును దూరం చేయకూడదు.
నీకు బాధగా ఉంటే కొంతసేపు బాధపడు, నిన్నేవరూ వద్దనలేదు. దుఃఖం ఎక్కువవుతుంటే గట్టిగా ఏడ్చెయ్, ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఆ భావోద్వేగాల్లో ఉండిపోకు, కాసేపు కాగానే వెనక్కి వచ్చెయ్.
కష్టాలు లేనపుడే ఆనందంగా పళ్ళికిలిస్తా అనుకుంటే అప్పటికి రెండు పళ్ళూడిపోయి నవ్వడానికి ఇబ్బందిపడే పరిస్థితి ఏర్పడవచ్చు. అందుకే నవ్వండి.
రోజులో కొంతసేపు హ్యాపీగా నవ్వుకోండి. నవ్వితే మీరు బాగుంటారు. మీకు మీరు మరింత అందంగా కనిపిస్తారు. అలా నవ్వుతూనే ఉంటే ఇంత అందగాడెవ్వరూ లేదనిపిస్తుంది. మీలో ఎనలేని ఎనర్జీ వచ్చేస్తుంది.