ప్రేరణ: సాధించాలన్న సంకల్పం ఉంటే విశ్వం కూడా సాయం చేస్తుంది
ఏ పని చేయడానికైనా సంకల్పం కావాలి. అది లేకపోతే మీరు చేయాలనుకున్న పనులు ఆలోచనల దగ్గరే ఆగిపోతాయి. ఆలోచనలు ఎవ్వరైనా చేస్తారు. వాటిని ముందుకు తీసుకెళ్ళేందుకే సంకల్పం కావాలి. నీవు బలంగా నమ్మి మొదలెట్టిన ఒక పని, ఖచ్చితంగా పూర్తవుతుంది. మధ్యలో ఎన్ని ఆటంకాలొచ్చినా సంకల్ప బలంతో పట్టు వదలకుండా శ్రమిస్తే విజయం తప్పక నీ సొంతమవుతుంది. వంద సార్లు ప్రయత్నించిన తర్వాతే థామస్ అల్వా ఎడిసన్ చేతిలో బల్బు వెలిగింది. 99సార్లు ఫెయిలైందని వందవ సారి ప్రయత్నించడం మానేస్తే, ఇప్పుడు మన ఇళ్ళల్లో చీకటే మిగిలేది. అందుకే అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టొద్దు. సంకల్పాన్ని వీడిపోవద్దు. ఒక్కోసారి మనం నీరసించిపోతాం, అప్పుడే వర్షపు చుక్క రూపంలో విశ్వం నీకు సాయం చేస్తుంది.
చేతిలో రూపాయి ఇవ్వని సంతోషం మనసులో సంకల్పం ఇస్తుంది
అనుకున్నది సాధించాలనే తపన మీకున్నప్పుడు అనుకోకుండా మీకు సాయం అందుతుంది. కొన్నిసార్లు మీకే విచిత్రంగా అనిపిస్తుంటుంది. మీకు బాగా తెలిసిన వాళ్ళు కూడా ఒక్కోసారి మీకు సాయం చేయకపోవచ్చు, అలాంటప్పుడే మీకసలు తెలియని వాళ్ళ సాయం అందుతుంది. ఓటమి వస్తుందనో, ఎవరైనా ఏమైనా అనుకుంటారనో, నీరసించిపోయామనో అనుకుని అనుకున్న దాన్ని వదిలిపెట్టకండి. మీ దృష్టి, మీ లక్ష్యం, మీ శ్వాస, మీ దేహం అన్నీ మీరనుకున్న పనిమీద పెడితే ఆ విశ్వం కూడా మీకు సాయం చేయడానికి ముందుకొస్తుంది. చేతిలో రూపాయి లేకపోయినా మీ ముఖం మీద చిరునవ్వు ఉండాలంటే మీ మనసు నిండా సంకల్పం ఉండాలి. అదే మిమ్మల్ని నడిపిస్తుంది. గెలిపిస్తుంది.