ప్రేరణ: గొప్ప పనులు చేయడానికే కాదు గొప్పగా ఆలోచించడానికి కూడా ధైర్యం కావాలి
మీకో విషయం తెలుసా? ఈ ప్రపంచంలో కొందరు మాత్రమే గొప్పవాళ్ళున్నారు. మిగిలిన జనాలంతా సామాన్యులే. సామాన్యులు గొప్పగా ఎందుకు కాలేకపోతున్నారో తెలుసా? గొప్పగా ఆలోచించలేకపోవడం వలన. అవును, గొప్పగా ఆలోచించడానికి కూడా కొంతమంది భయపడతారు. అబ్బో.. అది మనవల్ల కాని పని అనుకుని ఆలోచించడం మానేస్తారు. ఆలోచించడమే రాని వారికి ఆచరించడంఎలా వస్తుంది. అందుకే వాళ్ళు సామాన్యులుగా మిగిలిపోతున్నారు. ఒక వ్యక్తి తాను ఐఏఎస్ కావాలనుకుంటేనే ఐఏఎస్ కాగలుతాడు. తనవల్ల కాదనుకుని ఐఏఎస్ ఆలోచనలను పక్కన పెట్టేస్తే ఎలా అవుతాడు. ఎప్పటికీ కాలేడు. అందుకే మీ మనసులోకి ఆలోచనలు అన్నింటినీ రానివ్వండి. అది ఎలాంటి ఆలోచన అయినా సరే. కొన్నిసార్లు సిల్లీ ఆలోచనల్లోంచే గొప్ప పనులు మొదలవుతాయి.
గొప్ప ఆలోచనకు ఉదాహరణగా నిలిచిన రాజమౌళి
ఒక మనిషి సక్సెస్ లో అతని టాలెంట్ కంటే ఎక్కువ షేర్ అతని ధైర్యానికే ఉంటుంది. ఉదాహరణకు తెలుగు సినిమా దర్శకుడు రాజమౌళి గురించి మాట్లాడుకుంటే, మిగతా దర్శకులందరూ తెలుగు సినిమా స్థాయి వందకోట్ల కంటే ఎక్కువ ఉండదని అనుకున్నారు. కానీ రాజమౌళి ఒక్కడే 500కోట్ల వరకు ఆలోచించాడు. అలా ఆలోచించాడు కాబట్టే బాహుబలి సాధ్యమయ్యింది. లేదంటే తెలుగు సినిమా స్థాయి ఇప్పటికీ వందకోట్ల దగ్గరే కొట్టుకుంటూ ఉండేదేమో. రాజమౌళి మాదిరిగా సినిమాలు తీసే టాలెంట్ చాలామందికి ఉండవచ్చు. కానీ 500కోట్ల సినిమాను తీయవచ్చన్న ఆలోచన వాళ్ళకు కలగలేదు. ధైర్యానికీ, టాలెంట్ కీ తేడా అదే. కాబట్టి మీలో ధైర్యాన్ని పెంచుకోండి. అదే మిమ్మల్ని నడిపిస్తుంది.