ప్రేరణ: ప్రయత్నిస్తే పదిరోజుల్లో రాని విజయం వందరోజుల్లో వచ్చే అవకాశం
లావుగా ఉన్నారని, సన్నగా మారాలని ఈరోజు వ్యాయామం మొదలెట్టారనుకుందాం. ఎన్ని రోజుల్లో సన్నగా మారతారు? కరెక్టుగా ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే అది వారివారి శరీర తత్వాల్ని బట్టి ఉంటుంది. విజయం కూడా అంతే, ఇప్పుడు మొదలెడితే ఫలానా టైమ్ లో విజయం వస్తుందని చెప్పలేం. దానికి మీరు పెట్టే కృషిని బట్టి, ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది. అందుకే కొందరికి వందరోజుల్లో విజయం వచ్చిందని మీకు కూడా అలాగే వస్తుందని వంద రోజులు ప్రయత్నం చేసి, విజయం రాలేదని ఆ తర్వాత ప్రయత్నాన్ని మానేయకూడదు. మీరు ప్రయత్నాన్ని మానేస్తున్నారంటే విజయాన్ని వద్దనుకుంటున్నారని అర్థం. మీరు నిజంగా వద్దనుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. వద్దనుకుంటే విజయం ఎప్పుడూ మిమ్మల్ని పలకరించదు.
దూరం నడిచినా తీరం కనిపించట్లేదనే బాధను వదిలేయండి
విజయాన్ని వద్దనుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మీకో విషయం తెలుసా? మీరు పని చేస్తున్నా ఫలితం రావట్లేదంటే, చేస్తున్న పని మానేయకూడదు. ఆ పని చేసే విధానంలో మార్పు తీసుకురావాలి. ఆ మార్పే మిమ్మల్ని విజయానికి దగ్గర చేస్తుంది. విజయం కనిపించట్లేదు, ఎక్కడో ఉందని మీరు కంప్లైంట్ చేస్తే, మీరు ప్రయత్నం మొదలెట్టలేదని అర్థం. ప్రయత్నమే విజయానికి దారి చూపిస్తుంది. అందుకే ఏదొచ్చినా, ఎన్ని అడ్డంకులొచ్చినా ప్రయత్నాన్ని ఆపేయకూడదు. వర్షాకలం కదా అని సూర్యుడు రాకుండా ఉంటాడా? మీ ప్రయత్నం కూడా అంతే ఉండలి. అలాంటప్పుడే విజయం అనే వెలుగును చేరుకోగలుగుతారు. విజయం అందుకున్న వారినే ఈ ప్రపంచం గుర్తిస్తుంది, గుర్తుపెట్టుకుంటుంది. అపజయం వైపు ఎంత పెద్ద కారణమైనా ఉండనీ ఎవ్వరూ పట్టించుకోరు.