Loading...
Van Gogh Painting: వాన్ గో పెయింటింగ్‌కు రికార్డు ధర.. న్యూయార్క్ వేలంలో రూ.1,773 కోట్లు
వాన్ గో పెయింటింగ్‌కు రికార్డు ధర.. న్యూయార్క్ వేలంలో రూ.1,773 కోట్లు

Van Gogh Painting: వాన్ గో పెయింటింగ్‌కు రికార్డు ధర.. న్యూయార్క్ వేలంలో రూ.1,773 కోట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2026
12:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు విన్సెంట్ వాన్ గో గీసిన ఓ పెయింటింగ్ వేలంలో రికార్డు ధర పలికింది. ఆయన ఆత్మహత్యకు పాల్పడటానికి కొన్ని వారాల ముందు రూపొందించిన 'ఛాటెయినియర్స్ ఎన్ ఫ్లయర్స్' (Châtaigniers en fleurs) అనే చిత్రాన్ని ఏకంగా 190.4 మిలియన్ డాలర్లకు విక్రయించారు. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ.1,773 కోట్లు. న్యూయార్క్‌లో సోత్‌బేస్ నిర్వహించిన వేలంలో ఈ పెయింటింగ్ అంచనాలను మించిన ధరకు అమ్ముడైంది.

వివరాలు 

సోత్‌బేస్ మధ్యవర్తిత్వం

అయితే ఈ పెయింటింగ్ వేలానికి ముందు వివాదం నెలకొంది. నాజీల పాలన సమయంలో జర్మనీలో ఈ చిత్రాన్ని విక్రయించిన ఓ యూదు కుటుంబానికి చెందిన వారసులు దానిపై తమకు హక్కులు ఉన్నాయని పేర్కొంటూ ముందుకొచ్చారు.

దీంతో వేలం ప్రక్రియకు ఆటంకం కలగకుండా సోత్‌బేస్ మధ్యవర్తిత్వం వహించింది.

పెయింటింగ్ ప్రస్తుత యజమానులైన బ్లాకియర్-అరియేటా కుటుంబం, యూదు కుటుంబ వారసుల మధ్య ఒప్పందం కుదిర్చింది.

ఈ ఒప్పందంలోని వివరాలను వెల్లడించలేదు. అయితే ఇరు కుటుంబాలు సంతృప్తికరమైన పరిష్కారానికి అంగీకరించడంతో వేలం ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయింది.

మానసిక చికిత్సాలయం నుంచి 1890 మేలో విడుదలైన తర్వాత వాన్ గో ఈ పెయింటింగ్‌ను చిత్రించారు. ఆ తర్వాత రెండు నెలలకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.

వివరాలు 

2022 నాటి రికార్డును అధిగమించిన తాజా ధర

ఇప్పటివరకు వాన్ గో చిత్రాల్లో అత్యధిక ధరకు అమ్ముడైన పెయింటింగ్‌గా 2022లో విక్రయమైన 'వెర్జర్ అవెక్ సైప్రెస్' (Verger avec cyprès) నిలిచింది.

అప్పట్లో ఆ చిత్రం 117.2 మిలియన్ డాలర్ల ధర పలికింది. తాజాగా 'ఛాటెయినియర్స్ ఎన్ ఫ్లయర్స్' అమ్మకంతో ఆ రికార్డు బద్దలైంది.

ఇదే వేలంలో మరో ప్రముఖ చిత్రకారుడు పాల్ సెజాన్ రూపొందించిన 'ఆర్లేక్విన్' (Arlequin) పెయింటింగ్ కూడా భారీ ధరకు అమ్ముడైంది.

ఈ చిత్రం 111 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,033 కోట్లు) పలికింది. మొత్తంగా ఈ వేలంలో 12 పెయింటింగ్‌లు విక్రయమై, వాటి ద్వారా 412 మిలియన్ డాలర్ల ఆదాయం లభించింది.

ADVERTISEMENT