Green Chillies: ఘాటు రుచే కాదు ఆరోగ్యానికి ఖజానా.. పచ్చి మిర్చిపై నిపుణుల మాట
ఈ వార్తాకథనం ఏంటి
పచ్చి మిరపకాయలు కేవలం వంటకాలకు కారాన్ని జోడించడానికే కాదు... ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి ముఖ్యంగా విటమిన్ ఎ, సి సమృద్ధిగా కలిగి ఉండటంతో రోగనిరోధక శక్తిని పెంచడంలో, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. రోజువారీ ఆహారంలో పచ్చి మిరపకాయలను తగిన మోతాదులో చేర్చుకుంటే సులభంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని సూచిస్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం...
Details
యాంటీఆక్సిడెంట్లకు గనిగా
పచ్చి మిరపకాయల్లో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంతో పాటు, అనేక దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయంటున్నారు. పచ్చి మిరపకాయల్లో విటమిన్ ఎ, బి2, బి3, బి6, బి9, సి, ఇ లభిస్తాయని, ముఖ్యంగా విటమిన్ సి బలమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుందని National Library of Medicine అధ్యయనం పేర్కొంది.
Details
క్యాన్సర్ నివారణలో సహాయం
పచ్చి మిరపకాయల్లో ఉండే సహజ రసాయనాలు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇందులోని క్యాప్సైసిన్ అనే సమ్మేళనం శరీరంలోని హానికర కణాల పెరుగుదలను అడ్డుకుని, కొన్ని రకాల క్యాన్సర్ కణాలను నాశనం చేయగలదని అధ్యయనాలు వెల్లడించాయి. ముఖ్యంగా రొమ్ము, కడుపు, పెద్దప్రేగు క్యాన్సర్ కణాలపై దీని ప్రభావం కనిపించినట్లు పేర్కొన్నారు.
Details
బరువు నియంత్రణకు దోహదం
పచ్చి మిరపకాయలు జీవక్రియను వేగవంతం చేసి ఎక్కువ కేలరీలు ఖర్చయ్యేలా చేస్తాయని నిపుణులు అంటున్నారు. ఇందులోని క్యాప్సైసిన్ కొవ్వును కరిగించడంతో పాటు శరీరంలో కొవ్వు నిల్వలు ఏర్పడకుండా అడ్డుకుంటుందని చెబుతున్నారు. అలాగే ఇవి ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగించడం వల్ల అతిగా తినకుండా ఉండేందుకు సహాయపడతాయి. దీంతో ఆరోగ్యకరమైన బరువును నిలుపుకోవచ్చు.
Details
గుండె ఆరోగ్యానికి మేలు
పచ్చి మిరపకాయలు రక్తప్రసరణను మెరుగుపరచడం, రక్తం గడ్డకట్టకుండా చూడడం, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడం వంటి ప్రయోజనాలు కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా రక్తనాళాల్లో ఏర్పడే ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి, గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయని పేర్కొంటున్నారు. షుగర్ అదుపులో పచ్చి మిరపకాయలు కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను నెమ్మదింపజేసి, ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల శరీరం శక్తిని సమర్థవంతంగా వినియోగించుకుంటూ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. మిరపకాయల వల్ల కలిగే బరువు తగ్గుదల కూడా మెరుగైన ఇన్సులిన్ నియంత్రణ ఫలితమేనని, ఇది ఊబకాయం, మధుమేహం, హృదయ వ్యాధుల నియంత్రణకు సానుకూల ప్రభావం చూపుతుందని National Library of Medicine అధ్యయనం వెల్లడించింది.
Details
నొప్పి తగ్గించడంలో ఉపయోగం
పచ్చి మిరపకాయల్లో సహజ యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి కొన్ని సూక్ష్మజీవుల నుంచి రక్షణ కల్పించడమే కాకుండా, సహజ నొప్పినివారిణిలా కూడా పనిచేస్తాయని అంటున్నారు. ముఖ్యంగా ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారికి ఇవి ఉపశమనాన్ని ఇవ్వగలవని సూచిస్తున్నారు. మొత్తంగా చూస్తే, పచ్చి మిరపకాయలను మితంగా తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు అంటున్నారు. అయితే అధికంగా తీసుకుంటే అలర్జీలు, జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సరైన మోతాదులోనే వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.