LOADING...
Nuvvula Saddi: బతుకమ్మ పండుగలో గౌరమ్మకు పెట్టే నైవేద్యాల్లో ముఖ్యమైన వంటకం.. నువ్వుల సద్ది.. 
బతుకమ్మ పండుగలో గౌరమ్మకు పెట్టే నైవేద్యాల్లో ముఖ్యమైన వంటకం.. నువ్వుల సద్ది..

Nuvvula Saddi: బతుకమ్మ పండుగలో గౌరమ్మకు పెట్టే నైవేద్యాల్లో ముఖ్యమైన వంటకం.. నువ్వుల సద్ది.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 18, 2025
05:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో ప్రత్యేకంగా జరుపుకునే అందమైన పూల పండుగ బతుకమ్మ. ఈ పండుగ సమీపిస్తోందంటే చాలు గ్రామాలు, పట్టణాలు రంగురంగుల పూలతో నిండిపోతాయి. పూలను అందంగా పేర్చి బతుకమ్మగా రూపుదిద్ది, దేవతగా పూజించడం ఈ పండుగ విశిష్టత. బతుకమ్మపై తమలపాకు లేదా చిక్కుడు ఆకుపై పసుపుతో తయారు చేసిన గౌరమ్మను ఉంచుతారు. ధూపదీపాలతో ఆరాధించి, నైవేద్యం సమర్పిస్తారు. అనంతరం ఆ పసుపును తీసి మంగళసూత్రాలకు రాసుకుంటారు. తాము ధరించే పసుపు, కుంకుమ, అలాగే ఇంటి మొత్తం సకల సౌభాగ్యాలతో నిండాలని ప్రార్థిస్తారు. బతుకమ్మ పండుగలో చివరి రోజు జరుపుకునే సద్దుల బతుకమ్మ ప్రత్యేకం. ఈ రోజు గౌరమ్మకు సమర్పించే నైవేద్యం నువ్వుల సద్ది. నువ్వుల పొడితో ఇది తయారు చేస్తారు.

వివరాలు 

కావాల్సిన పదార్థాలు: 

వండిన అన్నం - నాలుగు కప్పులు నువ్వులు - అరకప్పు ఎండు మిరపకాయలు - నాలుగు కరివేపాకులు - రెండు రెమ్మలు మెంతి గింజలు - అరస్పూను నూనె - మూడు స్పూన్లు ధనియాలు - రెండు స్పూన్లు జీలకర్ర - ఒక స్పూను ఆవాలు - ఒక స్పూను పసుపు - అర స్పూను శెనగ పప్పు - ఒక స్పూను

వివరాలు 

తయారీ ఇలా... 

1. ముందుగా ఒక పాన్‌లో నువ్వులు, మెంతులు, ధనియాలు,ఎండు మిరపకాయలు వేసి వేయించి, మిక్సీలో బాగా పొడి చేసి పక్కన పెట్టాలి. 2. తరువాత అన్నం వండి పెట్టుకోవాలి.అన్నం పొడిగా ఉడికేలా జాగ్రత్త వహించాలి.ఉప్పు వేసి వండితే మళ్లీ కలపాల్సిన అవసరం ఉండదు. 3. స్టవ్‌పై పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. 4. జీలకర్ర, ఆవాలు, శెనగపప్పు, కరివేపాకు, ఎండు మిరపకాయలు వేసి బాగా వేయించాలి. 5. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి కలపాలి. 6. ఈ మిశ్రమంలో వండిన అన్నం వేసుకోవాలి. 7. అన్నం పైన ముందే చేసిన నువ్వుల పొడి వేసి, పులిహోరలా బాగా కలపాలి. 8.ఇంతటితో రుచికరమైన నువ్వుల సద్ది నైవేద్యం సిద్ధం అవుతుంది.

వివరాలు 

నువ్వుల ఆరోగ్య ప్రయోజనాలు

నువ్వులు తినడం వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటిలో విస్తృతంగా పోషకాలు ఉంటాయి. రక్తహీనతతో బాధపడే వారు, ఐరన్ లోపం ఉన్నవారు నువ్వులతో చేసిన వంటకాలు తింటే ఎంతో మేలు జరుగుతుంది. నువ్వులు బెల్లంతో కలిపి తింటే ఈ సమస్యలు త్వరగా తగ్గుతాయి. ఎందుకంటే రెండింటిలోనూ ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. నువ్వుల్లో అమినో ఆమ్లాలు, ప్రోటీన్లు అధికంగా ఉండటమే కాకుండా, మెగ్నీషియం కూడా పుష్కలంగా లభిస్తుంది. మధుమేహంతో బాధపడేవారికి నువ్వుల వంటకాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

వివరాలు 

నువ్వుల ఆరోగ్య ప్రయోజనాలు

ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అధికం కాకుండా అడ్డుకుంటాయి. అలాగే నువ్వుల్లో ఉండే సెసమాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ గుండె జబ్బులను దూరం చేయడంలో సహాయపడుతుంది. నువ్వుల నూనెతో వండిన వంటకాలు తినడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ నూనెలో ఒమెగా-6 ఫ్యాటీ ఆమ్లాలు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, అలాగే శరీరానికి అవసరమైన మంచికొవ్వు పుష్కలంగా ఉంటాయి. అందుకే దీనిని పవర్ హౌస్ అని పిలుస్తారు. అంతేకాదు, ఇందులో విటమిన్-E కూడా సమృద్ధిగా లభిస్తుంది.