
Parkinson's Disease: మెదడు కణాలు అతిగా పనిచేయడమే పార్కిన్సన్స్‌కు కారణం.. ప్రయోగాల్లో వెల్లడైన కీలక విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
పార్కిన్సన్స్ వ్యాధి కారణంగా రోగుల మెదడులో కొన్ని ముఖ్యమైన కణాలు ఎందుకు నశిస్తాయనే దీర్ఘకాలిక ప్రశ్నకు శాస్త్రవేత్తలు సమాధానం కనుగొన్నారు. పరిశోధన ప్రకారం, మెదడులోని కొన్ని ప్రత్యేక న్యూరాన్లను (కణాలను) వారాల పాటు అతి ఎక్కువగా ఉత్తేజపరచడం వల్ల అవి క్రమంగా శక్తి కోల్పోయి, చివరికి మరణిస్తాయి. ఈ కనుగొన్న అంశం పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సకు కొత్త దారులను తెరవగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ పరిశోధనను అమెరికాలోని గ్లాడ్‌స్టోన్ ఇన్‌స్టిట్యూట్స్‌లోని శాస్త్రవేత్తలు నిర్వహించారు. పార్కిన్సన్స్ వ్యాధిలో ముఖ్యంగా డోపమైన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేసే న్యూరాన్లు దెబ్బతినడం వల్ల వణుకు, కదలికలో నెమ్మదితనం వంటి లక్షణాలు ఉద్భవిస్తాయి. అయితే, ఈ న్యూరాన్లు ఎందుకు చనిపోతాయనేది ఇప్పటికీ మిస్టరీగా ఉంది.
వివరాలు
ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో వెల్లడైన కీలక విషయాలు
ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనడానికి పరిశోధకులు ఎలుకలపై ప్రయోగాలు చేపట్టారు. ఎలుకల మెదడులోని డోపమైన్ ఉత్పత్తి చేసే కణాలను ప్రత్యేక డ్రగ్ ద్వారా వారాలపాటు నిరంతరం సక్రియంగా ఉంచారు. కొన్ని రోజులలోనే ఎలుకల ప్రవర్తనలో మార్పులు గమనించారు. ఒక వారం తర్వాత న్యూరాన్లు క్రమంగా శక్తి కోల్పోవడం మొదలుపెట్టాయి. ఒక నెలలో ఆ కణాలు పూర్తిగా నశించిపోయినట్లు పరిశోధకులు గమనించారు. ఈ పరిణామంలో కణాలలోని కాల్షియం స్థాయిలు, డోపమైన్ ఉత్పత్తికి సంబంధించిన జన్యువుల పనితీరు వంటి కీలక అంశాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఆశ్చర్యకరంగా, పార్కిన్సన్స్ వ్యాధి ప్రారంభ దశలో ఉన్న రోగుల మెదడు నమూనాలను పరిశీలించినప్పుడు కూడా ఇలాంటి మార్పులు కనిపించాయి.
వివరాలు
ఈలైఫ్' జర్నల్‌లో అధ్యయన ఫలితాలు
ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన కెన్ నకామురా మాట్లాడుతూ,"పార్కిన్సన్స్ వ్యాధిలో కొన్ని ప్రత్యేక న్యూరాన్లు మాత్రమే ఎందుకు చనిపోతాయనేది పరిశోధనా రంగంలో పెద్ద ప్రశ్నగా ఉంది. దీన్ని అర్థం చేసుకోవడం ద్వారా వ్యాధి మూలాలను విశ్లేషించి, కొత్త చికిత్సలను అభివృద్ధి చేయవచ్చు"అని పేర్కొన్నారు. మానవులలో జన్యుపరమైన కారణాలు,పర్యావరణంలో ఉన్న విష పదార్థాలు, దెబ్బతిన్న ఇతర కణాల పనిని భర్తీ చేసేందుకు మిగిలిన కణాలు ఎక్కువ పనిచేయడం వంటి కారణాలు కూడా ఈ పరిస్థితికి దారితీయవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ అధ్యయన ఫలితాలను ప్రఖ్యాత 'ఈలైఫ్' జర్నల్‌లో ప్రచురించారు. ప్రపంచవ్యాప్తంగా 80 లక్షల మందికి పైగా ఈ వ్యాధితో బాధపడుతున్న సందర్భంలో, ఈ కొత్త పరిశోధన రోగులకి కొత్త ఆశలను ప్రసాదిస్తోంది.