LOADING...
Dangerous Fruit: ఈ పండు కిడ్నీ రోగులకు ప్రమాదకరం.. తినాలనుకుంటే వైద్య సలహా తప్పనిసరి..
ఈ పండు కిడ్నీ రోగులకు ప్రమాదకరం.. తినాలనుకుంటే వైద్య సలహా తప్పనిసరి..

Dangerous Fruit: ఈ పండు కిడ్నీ రోగులకు ప్రమాదకరం.. తినాలనుకుంటే వైద్య సలహా తప్పనిసరి..

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 07, 2025
12:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

పండ్లు శరీరానికి మంచివని, రోజూ పండ్లు తింటే రోగ నిరోధక శక్తి పెరిగి, అవసరమైన విటమిన్లు-ఖనిజాలు అందుతాయని అందరికి తెలుసు. అయితే ప్రతీ పండు అందరికీ అనుకూలం కాదు. ముఖ్యంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు తినే ఆహారంలో చాలా జాగ్రత్త అవసరం. ఒక చిన్న పొరపాటు కూడా వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. అలాంటి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పండ్లలో స్టార్ ఫ్రూట్‌ (Star Fruit) ఒకటి. ఈ పండు బయటకు చూసినప్పుడు ఆకర్షణీయంగా ఉంటుంది. పసుపు రంగులో నక్షత్రం ఆకారంలో ఉండే ఈ పండు మార్కెట్‌లో చాలామంది దృష్టిని ఆకర్షిస్తుంది.

వివరాలు 

 వివిధ విటమిన్లు, ఖనిజాలు కలిగిన పండు 

రుచి కూడా బాగానే ఉండటంతో పాటు ఇందులో వివిధ విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులకి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ కిడ్నీ వ్యాధి ఉన్నవారికి మాత్రం ఇది ప్రమాదకరమైన ఫలితం ఇవ్వొచ్చు. వైద్య నిపుణుల సమాచారం ప్రకారం, స్టార్ ఫ్రూట్‌లో 'కారాంబాక్సిన్‌ (Caramboxin)' అనే న్యూరోటాక్సిన్ ఉంటుంది. ఈ విషపదార్థాన్ని ఆరోగ్యంగా పనిచేసే కిడ్నీలు శరీరం నుండి బయటకు పంపగలుగుతాయి. కానీ కిడ్నీలు బలహీనంగా ఉన్నవారిలో ఈ టాక్సిన్ బయటికి వెళ్లక శరీరంలోనే చేరిపోతుంది. దీంతో: తలనొప్పి, వాంతులు, బలహీనత, ఆందోళన, తికమక, మూర్చ, తీవ్రమైన సందర్భాల్లో కోమా వంటి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.

వివరాలు 

డయాలసిస్‌ తీసుకుంటున్న వారు ఈ పండు తినకండి 

ఇండియన్ జర్నల్ ఆఫ్ నెఫ్రాలజీ ప్రకారం, కిడ్నీ రోగులు స్టార్‌ఫ్రూట్‌ తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఎక్కువ. ఇంకా నరాలపై ప్రభావం చూపి మానసిక గందరగోళం వంటి సమస్యలు కూడా రావచ్చు. ముఖ్యంగా డయాలసిస్‌ తీసుకుంటున్న వారు ఈ పండు తినడం ఆరోగ్యాన్ని మరింతగా క్షీణించిస్తుంది. "కిడ్నీ సమస్యలున్నవారు స్టార్ ఫ్రూట్‌ని పూర్తిగా దూరంగా ఉంచాలి. తినవలసిన పరిస్థితి వచ్చినా, ముందుగా నెఫ్రాలజిస్టు లేదా డైట్ నిపుణుడిని సంప్రదించాలి" అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

వివరాలు 

కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే:

తగినంత నీరు తాగాలి ఉప్పు తగ్గించాలి ప్రాసెస్‌డ్ ఫుడ్, జంక్ ఫుడ్ పూర్తిగా నియంత్రించాలి పండ్లు, కూరగాయలు తీసుకునే ముందు వైద్య సలహా తీసుకోవాలి పొటాషియం అధికంగా ఉన్న ఆహారాలను పరిమితంగా తీసుకోవాలి మొత్తానికి.. అన్నీ పండ్లు ఆరోగ్యానికి మంచివిగా అనిపించినా, కిడ్నీ రోగులకు స్టార్‌ఫ్రూట్‌ మాత్రం విషంలాంటిదే. చిన్న నిర్లక్ష్యం కూడా తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి, మీ ఆరోగ్య పరిస్థితి ఆధారంగా ఆహారాన్ని తెలివిగా ఎంచుకోవడం చాలా ముఖ్యం. గమనిక: ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. కిడ్నీ లేదా ఇతర అనారోగ్య సమస్యలుంటే, ఏ ఆహార మార్పు చేయడానికి ముందు తప్పనిసరిగా వైద్యుడి సలహా తీసుకోండి.