Pradhan Mantri Surya Ghar Muft Bijli Yojana: పీఎం సూర్య ఘర్ యోజనతో ఇంటింటా ఉచిత కరెంట్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్‌లీ యోజనను ప్రధాని నరేంద్ర మోదీ 2024 ఫిబ్రవరి 15న అధికారికంగా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా గృహాలకు ఉచిత విద్యుత్ అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. ప్రభుత్వంపై విద్యుత్ సబ్సిడీ భారం తగ్గించడం, పునరుత్పాదక శక్తి వినియోగాన్ని విస్తరించడం, కర్బన ఉద్గారాలను నియంత్రించడం, అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద దేశీయ రూఫ్‌టాప్ సోలార్ కార్యక్రమం ద్వారా తక్కువ ఆదాయ కుటుంబాలకు లబ్ధి చేకూర్చడం ఈ పథకంలోని కీలక లక్ష్యాలు.
వివరాలు
300 యూనిట్లు ఉచిత విద్యుత్
పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్‌లీ యోజన కింద ఇళ్ల పైకప్పులపై సౌర విద్యుత్ ఫలకాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. ఈ పథకం ప్రకారం ఒక్కో కిలోవాట్ సామర్థ్యానికి రూ.30 వేల సబ్సిడీ లభిస్తుంది. రెండు కిలోవాట్ల సామర్థ్యానికి రూ.60 వేల వరకు, మూడు కిలోవాట్ల వ్యవస్థకు రూ.78 వేల వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది.
వివరాలు
రుణ సౌకర్యం కూడా అందుబాటులో
మూడు కిలోవాట్ల సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి సుమారు రూ.1.45 లక్షలు ఖర్చవుతుంది. ఇందులో కేంద్రం గరిష్ఠంగా రూ.78 వేల వరకు భరిస్తుంది. మిగిలిన మొత్తానికి ఎలాంటి పూచీకత్తు అవసరం లేకుండా, తక్కువ వడ్డీ రేట్లతో బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం పొందవచ్చు. ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ వంటి ప్రముఖ బ్యాంకులు ఈ రుణాలను అందిస్తున్నాయి.
వివరాలు
అదనపు విద్యుత్ విక్రయ అవకాశం
ఈ పథకంలో భాగస్వాములైన లబ్ధిదారులు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వినియోగించుకోవచ్చు. అవసరానికి మించి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేసి ఆదాయం కూడా పొందే వీలుంది. సబ్సిడీ పొందేందుకు pmsuryaghar.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఆంధ్రప్రదేశ్‌లో నివాస గృహ యజమానులు, పైకప్పుపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకునేందుకు తగిన స్థలం ఉన్నవారు అర్హులుగా ఉంటారు.
వివరాలు
దరఖాస్తు విధానం
ముందుగా పీఎం సూర్య ఘర్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. అనంతరం రూఫ్‌టాప్ సోలార్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించాలి. డిస్కం నుంచి అనుమతి వచ్చిన తర్వాత, నమోదు అయిన వెండర్ల ద్వారా సోలార్ ప్యానెల్స్ ఇన్‌స్టాలేషన్ చేయించుకోవాలి. వ్యవస్థ అమర్చిన అనంతరం అవసరమైన వివరాలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి, నెట్ మీటర్ ఏర్పాటు చేయించుకుంటే సబ్సిడీ మొత్తం నేరుగా లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.
వివరాలు
ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక లబ్ధి
రూఫ్‌టాప్ సోలార్ ప్రయోజనాలు ఎక్కువ మందికి చేరేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 20 లక్షల 10 వేల విద్యుత్ కనెక్షన్లకు పీఎం సూర్య ఘర్ పథకం కింద ఉచితంగా సౌర విద్యుత్ పలకలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒక్కో ఇంటిపై రెండు కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ వ్యవస్థను అమర్చనున్నారు. లబ్ధిదారులకు ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం లీజు రూపంలో ప్రతి నెలా చెల్లింపులు చేస్తుంది. ఇందుకు సంబంధించిన సర్వేను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది.
వివరాలు
కరెంట్ బిల్లు భారం పూర్తిగా తగ్గుతుంది
ప్రతి ఇంటి పైకప్పుపై విద్యుత్ ఉత్పత్తి జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోనే పిలుపునిచ్చారు. ఆ దిశగా కుప్పం నియోజకవర్గంలోని నడిమూరు గ్రామంలో గత నెల పీఎం సూర్య ఘర్ సోలార్ పైలట్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఒక్కో ఇల్లు నెలకు సుమారు 200 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగలదు. ఇందులో 60 యూనిట్లు ఇంటి అవసరాలకు వినియోగించుకోవచ్చు, మిగిలిన 140 యూనిట్లు గ్రిడ్‌కు సరఫరా చేయవచ్చు. దీని ద్వారా సంవత్సరానికి సుమారు రూ.4 వేల విలువైన ఉచిత విద్యుత్ లభించడంతో పాటు, అదనంగా రూ.5 వేల వరకు ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు. భవిష్యత్తులో విద్యుత్ బిల్లుల భారం పూర్తిగా తప్పుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.