
Study in UK : యూకేలో చదువుకు అంతర్జాతీయ విద్యార్థుల నుంచి డిమాండ్.. ఎందుకంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
విధానాల మార్పులు, ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ, యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) అంతర్జాతీయ విద్యార్థుల కోసం ప్రసిద్ధిగాంచిన గమ్యస్థానంగా నిలుస్తోంది.
దీన్ని నిరూపించే విధంగా, యూకేలో చదువు కోసం వీసా దరఖాస్తుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.
2024 జనవరి నెలతో పోలిస్తే, 2025 జనవరిలో వీసా అప్లికేషన్లు 13 శాతం పెరిగి 28,700కి చేరుకున్నాయి.
గత సంవత్సరం అక్టోబర్ తరువాత వీసా దరఖాస్తుల సంఖ్య మొదటిసారి ఇంతగా పెరిగింది.
ఇది యూకేలో ఉన్న విద్య సంబంధిత డిమాండ్‌ను స్పష్టంగా చూపిస్తోంది.
పలు విధానపరమైన మార్పులు చోటు చేసుకున్నప్పటికీ విద్యార్థుల ఆసక్తి తగ్గలేదని, భవిష్యత్తులోనూ ఇది కొనసాగుతుందన్న అంచనాను ఇంటర్నేషనల్ స్టూడెంట్ లోన్ సంస్థ అయిన ప్రాడిగీ ఫైనాన్స్ వెలిబుచ్చింది.
వివరాలు
ధరలు, మార్పులు ఉన్నా.. యూకేపై ఆసక్తి తగ్గలేదు
విద్య ఖర్చులు పెరుగుతున్నా,పాలసీల్లో మార్పులు చోటుచేసుకున్నా..విద్యార్థులు యూకేను చదువుకు ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నారు.
2024 జనవరిలో యూకే ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం,పోస్ట్‌గ్రాడ్యుయేట్ రీసెర్చ్ విద్యార్థులు లేదా ప్రభుత్వ సహాయంతో చదువుకునే వారికి మాత్రమే ఒక డిపెండెంట్‌ను తీసుకురావడానికి అనుమతి ఉంటుంది.
ఈ మార్పు వలన డిపెండెంట్ వీసా దరఖాస్తులు 2023 జనవరిలో 17,500 ఉండగా,2025 జనవరికి అది 2,300కి పడిపోయాయి.
ఇక ఏప్రిల్ 2025 నుంచి వీసా అప్లికేషన్ ఫీజు 13శాతం పెరిగిన నేపథ్యంలో, విద్యార్థుల ఎడ్యుకేషన్ బడ్జెట్ మరింతగా భారంగా మారనుంది.
ఈ మార్పుల వల్ల భవిష్యత్తులో వీసా దరఖాస్తులపై ప్రభావం పడే అవకాశమున్నా, గత అనుభవాల ప్రకారం యూకే చదువుకు కేంద్రంగా నిలుస్తుందన్న నమ్మకాన్ని ప్రాడిగీ ఫైనాన్స్ వ్యక్తం చేసింది.
వివరాలు
విద్యార్థుల ఆశలకు మద్దతుగా ప్రాడిగీ ఫైనాన్స్
"ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు తమ విద్యా ప్రయాణానికి యూకే వైపు చూస్తున్నారు," అని ప్రాడిగీ ఫైనాన్స్ గ్లోబల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సోనాల్ కపూర్ తెలిపారు.
"ధరలు పెరిగినా, వీసా నిబంధనలు మారినా విద్యార్థులు వెనక్కి తగ్గడంలేదు. వారికి మద్దతుగా మేము వివిధ రకాల లోన్లు అందిస్తున్నాం అనే విషయం మాకు గర్వకారణం" అని ఆమె వివరించారు.
వివరాలు
యూనివర్సిటీలు కూడా విద్యార్థులకి అండగా
విద్యార్థుల ఆర్థిక భారం తగ్గించేందుకు యూకేలోని పలు విశ్వవిద్యాలయాలు ముందుకొస్తున్నాయి.
ప్రాడిగీ ఫైనాన్స్ ద్వారా లోన్ పొందిన విద్యార్థుల కోసం సీఏఎస్ డిపాజిట్ రద్దు చేసిన విశ్వవిద్యాలయాల్లో ఆస్టన్ యూనివర్సిటీ, బ్రునెల్ యూనివర్సిటీ, బాంగోర్ యూనివర్సిటీ, డీ-మాంట్‌ఫోర్ట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ అబెర్డీన్, ఈస్ట్ ఆంగ్లియా విశ్వవిద్యాలయం, రీడింగ్ యూనివర్సిటీ, కింగ్‌స్టన్ యూనివర్సిటీ ఉన్నాయి. ఇది విద్యార్థులకు ఆర్థికంగా ఉపశమనం కలిగించే అంశం.
వివరాలు
భారతీయుల హవా, కొత్త దృష్టికోణాలు
యూకేలో ఈయూకు చెందని విద్యార్థుల్లో భారతీయులే అత్యధికంగా ఉన్నారు. విద్య వ్యయాలు పెరగడం వల్ల ఇప్పుడు విద్యార్థులు విశ్వవిద్యాలయాలను కేవలం ర్యాంకింగ్స్ ప్రకారమే కాకుండా, ఆర్థిక ఖర్చులు, డిగ్రీ అనంతర అవకాశాల ఆధారంగా కూడా పరిశీలిస్తున్నారు.
వారికి తోడుగా పలు స్కాలర్‌షిప్‌లు, యూనివర్సిటీ భాగస్వామ్యాలు, తక్కువ ఏపీఆర్‌తో లోన్లకు కో-సిగ్నింగ్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
వివరాలు
వృద్ధి చెందుతున్న ప్రపంచంలో విద్యకు ఆర్థిక మద్దతు అవసరం
నేటి వేగంగా మారుతున్న ప్రపంచంలో, విద్యార్థులు తమ భవిష్యత్ ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని చదువును కొనసాగించాలంటే, నమ్మదగిన ఆర్థిక మద్దతు అవసరం. ప్రాడిగీ ఫైనాన్స్ అందిస్తున్న విద్యా లోన్ల ద్వారా, విద్యార్థులు తమ కలలను నెరవేర్చుకునే దిశగా ముందడుగు వేయవచ్చు.
ధరల పెరుగుదల, పాలసీల మార్పులకు సమన్వయం చేసుకుంటూ విద్యార్థులు, విశ్వవిద్యాలయాలు ముందడుగులు వేస్తుండటం, వారికి ఆర్థిక మద్దతు అందుతున్న దృష్ట్యా.. యూకేలో చదువుకు మరింత మంది విద్యార్థులు ఆసక్తి చూపుతుండడం సహజమే.