Pulses: ఏ పప్పులో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి.. ఎందులో ఎంతమేర లభిస్తాయంటే..
మన దేశంలో పప్పు ధాన్యాల వాడకం ఎక్కువగా ఉంటుంది. ఇవి ప్రోటీన్ వనరులు. ప్రోటీన్లు మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఇవి కండరాలు, ఎముకలు, చర్మం, జుట్టు హెల్తీగా ఉండేందుకు సహాయపడతాయి. కణాల మరమ్మతును ప్రోత్సహిస్తాయి, దీంతో గాయాలు త్వరగా మానుతాయి. అయితే మన శరీరం ప్రోటీన్‌ను స్వయంగా తయారు చేసుకోదు. అందువల్ల రోజువారీ అవసరాలకు తగిన మాంసకృత్తుల కోసం కంది, మినప, పెసర పప్పులు వంటి ఆహారాలు తినాలి. ఇప్పుడు వీటిలో దేని నుంచి ఎక్కువ ప్రోటీన్ లభిస్తుందో తెలుసుకుందాం.
మినపప్పు
మినపప్పులో ప్రోటీన్, ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయి. 100 గ్రాముల మినపప్పులో సుమారు 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది,ఇది మన శరీర అవసరాలకు సరిపడిన మొత్తానికి చాలా అధికం. అదనంగా, మినపప్పులో ఫైబర్, ఐరన్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ డైజెస్టివ్ సిస్టమ్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది, ఐరన్ రక్తం ఎక్కువగా తయారయ్యేలా చేస్తుంది. పెసరపప్పు పెసరపప్పు చాలా తేలిగ్గా డైజెస్ట్ అవుతుంది,అందువల్ల అజీర్తి సమస్యలు ఉన్నవారు దీన్ని తమ డైట్‌లో యాడ్ చేసుకోవచ్చు. 100 గ్రాముల పెసరపప్పులో దగ్గరదగ్గరగా 24 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దీని వంటకాలు డైలీ తింటే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది.కండలు బలవంతమైన బాడీని అందిస్తాయి.పెసరపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల,ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
కందిపప్పు
కందిపప్పును విభిన్న వంటకాల తయారీలో ఉపయోగిస్తారు. ఇందులో కూడా ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. 100 గ్రాముల కందిపప్పులో సుమారు 22 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇందులో ఫైబర్, పొటాషియం వంటి పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. పొటాషియం మన గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారు? ఎక్స్పర్ట్ డైటీషియన్ ప్రకారం.. మినప్పప్పులో ప్రోటీన్లు అత్యధికంగా ఉంటాయని చెప్పారు. అలాగే పెసర, కంది పప్పులో కూడా మంచి మోతాదులో ప్రోటీన్ ఉంటుందని తెలిపారు. రోజూ తినే ఆహారంలో ఈ పప్పులు మిక్స్ చేస్తే, శరీరానికి కావాల్సిన మాంసకృత్తులు, ఇతర పోషకాలు అందుతాయని స్పష్టం చేశారు.
ఇతర ఫుడ్స్
అయితే ప్రోటీన్ అవసరాలకు కేవలం ఈ మూడు రకాల పప్పుధాన్యాలే తినాల్సిన అవసరం లేదు. ఇంకా అనేక రకాల పప్పులు అందుబాటులో ఉన్నాయి, ఉదాహరణకు బొబ్బర్లు, రాజ్మా, శనగపప్పు, ఎర్రపప్పు. లేకుంటే పనీర్‌తో తయారైన వంటకాలు తరచూ తినడం మంచిది. అయితే, మీ బాడీకి తగిన ఆహారం ఏవో తెలుసుకోవడానికి న్యూట్రిషనిస్ట్ లేదా డైటీషియన్ల సలహాలు తీసుకోవడం మంచిది.