Dehydration: ఉపవాసాలు చేసే సమయంలో డీహైడ్రేషన్.. ఈ సమస్య ఏమిటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? నివారణ చర్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు.
మార్చి 16న చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయనకు మెడ నొప్పి, డీహైడ్రేషన్ లక్షణాలు ఉన్నాయని అపోలో ఆసుపత్రి మెడికల్ బులెటిన్ వెల్లడించింది.
అయితే ప్రస్తుతం రెహమాన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
రంజాన్ ఉపవాసాల కారణంగా డీహైడ్రేషన్ సమస్య వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
సాధారణంగా, శరీరానికి తగినంత నీరు అందకపోతే డీహైడ్రేషన్ సమస్య ఉత్పన్నమవుతుంది.
ముఖ్యంగా వేసవి కాలంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దీని కారణంగా తీవ్ర దాహం, తలనొప్పి, అలసట, బలహీనత, చర్మం పొడిబారిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
వివరాలు
నివారణ చర్యలు
ఎక్కువగా చెమట పట్టడం, తక్కువ నీరు తాగడం, అనారోగ్యం, కొన్ని మందుల ప్రభావం, వయస్సు పెరుగుదల, గర్భధారణ వంటి కారణాలతో డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంది.
దీని నివారణకు రోజుకు కనీసం మూడు లీటర్ల నీరు త్రాగడం, నీరు అధికంగా ఉండే పండ్లను తీసుకోవడం, ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు నీటి బాటిల్ వెంట ఉంచుకోవడం, కెఫిన్, ఆల్కహాల్ తగ్గించడం, ఎండలో ఎక్కువసేపు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
వ్యాయామం చేసే సమయంలో ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ తీసుకోవడం కూడా ఉపయుక్తంగా ఉంటుంది.
నిర్లక్ష్యం చేసినట్లయితే డీహైడ్రేషన్ సమస్య తీవ్రమై ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉన్నందున, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యమైనది.