Page Loader
Sheer Khurma: రంజాన్ స్పెషల్.. నోరూరించే రుచితో షీర్ ఖుర్మా ఇలా తయారుచేసుకోండి!
రంజాన్ స్పెషల్.. నోరూరించే రుచితో షీర్ ఖుర్మా ఇలా తయారుచేసుకోండి!

Sheer Khurma: రంజాన్ స్పెషల్.. నోరూరించే రుచితో షీర్ ఖుర్మా ఇలా తయారుచేసుకోండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 28, 2025
01:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

రంజాన్ ముగింపుతో ఈద్-ఉల్-ఫితర్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ప్రత్యేకమైన స్వీట్ షీర్ ఖుర్మా సిద్ధం చేయడం అనేది సంప్రదాయంగా కొనసాగుతున్న ఆచారం. పాలు, సేమియా, ఖర్జూరాలతో పాటు వివిధ రకాల డ్రై ఫ్రూట్స్‌తో తయారయ్యే ఈ స్వీట్ లేకుండా ఈద్ పండుగ అసంపూర్తిగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ రుచికరమైన షీర్ ఖుర్మాను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. షీర్ ఖుర్మా అనేది పాలు, సేమియా, ఖర్జూరాలు, పంచదార, డ్రై ఫ్రూట్స్ కలిపి చేసుకునే ఓ ప్రత్యేకమైన స్వీట్. 'షీర్' అంటే పాలు, 'ఖుర్మా' అంటే ఖర్జూరం అని పర్షియన్ భాషలో అర్థం. దీనిని షెమాయ్ అని కూడా పిలుస్తారు.

Details

కావాల్సిన పదార్థాలు

1 లీటరు ఫుల్ క్రీమ్ పాలు 1 కప్పు సన్నని వర్మిసెల్లి (సేమియా) 4-5 టీస్పూన్లు చక్కెర (రుచికి తగ్గట్టుగా) 2 టేబుల్ స్పూన్లు నెయ్యి 10-12 జీడిపప్పు (సన్నగా తరిగినవి) 10-12 బాదం పప్పులు (సన్నగా తరిగినవి) 10-12 పిస్తాపప్పులు (సన్నగా తరిగినవి) 5-6 ఖర్జూరాలు (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి) 1 స్పూన్ ఏలకుల పొడి కొంచెం కుంకుమపువ్వు

Details

తయారీ విధానం

1.ముందుగా, ఒక గిన్నెలో పాలను పోసి మీడియం మంట మీద మరిగించాలి. 2.పాలు చిక్కబడి మంచి రుచిగా మారేందుకు నిరంతరం కలుపుతూ ఉండాలి. 3.పాలు మరిగిన తర్వాత మంట తగ్గించి, 10-15 నిమిషాలు ఉడికించాలి. 4.వేరే పాన్‌లో నెయ్యి వేసి వేడి చేసి, అందులో సేమియాను లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. 5.మరిగుతున్న పాలలో వేయించిన సేమియాను జత చేసి బాగా కలపాలి. 6.సేమియా మెత్తబడే వరకు 5-7 నిమిషాలు మగ్గనివ్వాలి. 7.తర్వాత చక్కెర జోడించి బాగా కలిపి మరో 2 నిమిషాలు మరిగించాలి. 8.తరిగిన జీడిపప్పు, బాదం, పిస్తా, ఖర్జూరాన్ని వేసి కలపాలి. 9.చివరగా ఏలకుల పొడి, కుంకుమపువ్వు వేసి మరో 2-5 నిమిషాలు మరిగించాలి.

Details

 ఇంకా రుచిగా చేసేందుకు కొన్ని చిట్కాలు 

మందపాటి షీర్ ఖుర్మా కావాలంటే పాలను ఎక్కువ సేపు మరిగించాలి. చల్లగా తిన్నా రుచే.. కానీ వేడిగా వడ్డిస్తే మరింత ఆనందమయం. మరిన్ని రుచులు కోసం అంజూర్ ముక్కలు లేదా పుచ్చకాయ గింజలు జోడించవచ్చు. డయాబెటిస్ రోగులు స్వల్పంగా తీసుకుంటే మంచిది. ఈ పండుగ రోజున ఇంట్లోనే ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన షీర్ ఖుర్మాను తయారు చేసి, మీ కుటుంబసభ్యులు, స్నేహితులతో ఆనందంగా పంచుకోండి!