Ramadan: రంజాన్‌లో ఖర్జూరాలతోనే ఉపవాస విరమణ ఎందుకు..? కారణాలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన వెంటనే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ముస్లింలు ఉపవాస దీక్షలు చేపడుతున్నారు. ఉదయం సూర్యోదయం నుంచి సాయంత్రం సూర్యాస్తమయం వరకు ఆహారం,నీరు తీసుకోకుండా ఇస్లాం మతంలోని ఐదు మూల సూత్రాల్లో ఒకటైన ఉపవాసాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తున్నారు. అయితే సూర్యాస్తమయం అయిన వెంటనే ఉపవాసాన్ని ఖర్జూరాలతోనే విరమించడం సంప్రదాయంగా కొనసాగుతోంది. మహమ్మద్ ప్రవక్త ఉపవాస విరమణను ఖర్జూరాలతో చేయాలని సూచించారని, ఖురాన్‌లో కూడా ఖర్జూరాల ప్రాముఖ్యత పలుమార్లు ప్రస్తావించబడిందని మతపండితులు చెబుతున్నారు. అయితే ఖర్జూరాలకు కేవలం ఆధ్యాత్మిక ప్రాధాన్యం మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా విస్తారంగా ఉన్నాయి. ఎక్కువసేపు ఆహారం తీసుకోకుండా ఉన్న తర్వాత శరీరానికి తక్షణ శక్తి అవసరం అవుతుంది.
వివరాలు
ఖర్జూరం… శరీరానికి ఎనర్జీ బూస్టర్ ఎలా అవుతుంది?
ఖర్జూరాల్లో ఉండే సహజ చక్కెరలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని త్వరగా పెంచి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అంతేకాదు,వీటిలో సరళ చక్కెరలతో పాటు సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉండటం వల్ల శక్తి నెమ్మదిగా విడుదలవుతూ ఎక్కువసేపు ఉపయోగపడుతుంది. విటమిన్ బి6, ఎ, కెతో పాటు ఐరన్ వంటి పోషకాలు కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఖర్జూరాల్లో పొటాషియం ఉండటంతో శరీరంలో ద్రవ సమతుల్యతను కాపాడటంలో సహాయపడుతుంది. అందుకే ఇఫ్తార్ సమయంలో ముందుగా ఖర్జూరం, నీరు తీసుకోవడం సంప్రదాయంగా మారింది. ఇలా చేయడం వల్ల శరీరానికి శక్తి, హైడ్రేషన్ రెండూ లభిస్తాయి.
వివరాలు
రోజుకు సుమారు 30 గ్రాముల ఫైబర్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచన
ఇక ఇఫ్తార్ సమయంలో అతిగా తినే అలవాటు తగ్గించడంలో కూడా ఖర్జూరాలు ఉపయోగపడతాయి. సాధారణంగా ముందుగా బేసి సంఖ్యలో ఖర్జూరాలు తీసుకుని నమాజ్ పూర్తి చేసిన తర్వాత ప్రధాన భోజనం చేస్తారు. దీంతో ఆకలి తక్కువై జీర్ణక్రియ సజావుగా ప్రారంభమవుతుంది.ఉపవాస సమయంలో మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు సాధారణమే. ఖర్జూరాల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోజుకు సుమారు 30 గ్రాముల ఫైబర్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఖర్జూరాలు నచ్చనివారు వివిధ రకాల ఖర్జూరాలను ప్రయత్నించవచ్చు. కొన్నిమృదువుగా, కొన్ని కొద్దిగా గట్టిగా ఉంటాయి. అవసరమైతే స్మూతీలో కలిపి తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద రంజాన్ ఉపవాసంలో ఖర్జూరాలకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పడంలో సందేహం లేదు.