Viral : ఒకే బిడ్డను మోసి జన్మనిచ్చిన స్వలింగ జంట.. చరిత్ర సృష్టించిన స్పెయిన్ కపుల్
స్వలింగ జంట చరిత్ర సృష్టించింది. ఇద్దరూ కలిసి ఒకే బిడ్డను తమ గర్భంలో మోసి జన్మనివ్వడం విశేషం. స్పెయిన్ దేశానికి చెందిన ఎస్టీఫానియా, అజహారా స్వలింగ సంపర్క జంట అక్టోబర్ 30న ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అయితే వారిద్దరూ మహిళలే కావడం గమనార్హం. ఈ క్రమంలోనే పిల్లల్ని కని, మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఓ ఫెర్టిలిటి కేంద్రాన్ని ఆశ్రయించారు. ముందుగా ఎస్టీఫానియా మహిళా, గర్భంలో స్పెర్మ్‌ని ప్రవేశపెట్టారు. అనంతరం ఫలదీకరణం చెందేలా వైద్యులు కృషి చేశారు. అక్కడితో ఆగకుండా ఐదు రోజుల తర్వాత ఆ పిండాన్ని అజహారా గర్భంలో ప్రవేశపెట్టారు. అలా ఇద్దరూ ఒకే బిడ్డను మోసి నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చి అరుదైన అనుభూతిని పొందారు.
బిడ్డ పుట్టడంతో తమ బంధం మరింత బలోపేతం అంటున్న స్వలింగ జంట
ఈ ప్రక్రియ కోసం ఈ జంట దాదాపుగా రూ.4.5 లక్షలు ఖర్చుచేశారు. తాము ఇద్దరం కలిసి జన్మనివ్వడం అంటే ఒకరిపట్ల మరొకరు తమ అనుబంధాన్ని మరింత బలపేతం చేసుకున్నట్లేనన్నారు. దీంతో తమకు పట్టరాని సంతోషంగా ఉందని ఆ స్వలింగ దంపతులు అంటున్నారు. అయితే ఇలా బిడ్డకు జన్మనివ్వడం వైద్య పరంగా ఇన్వోసెల్ (సంతానోత్పత్తి చికిత్స)గా పేర్కొంటారు. గతంలోనే 2018లో అమెరికాలోని టెక్సాస్‌లో ఓ స్వలింగ జంట (ఇద్దరు మహిళలు) ఒకే బిడ్డను మోశారు. దీంతో ప్రపంచంలోనే తొలి స్వలింగ జంటగా నిలిచారు. స్వలింగ జంటలకు ఈ సరికొత్త వైద్య విధానం వరంగా మారింది. ఈ ఆధునిక వైద్య విధానంతో సంతానం కోసం ఆశపడే దంపతులకు అద్భుతమైన చికిత్సగా నిలుస్తోంది.