LOADING...
#SankranthiSpecial: సంక్రాంతి పండుగ.. రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన గాలిపటాలు
సంక్రాంతి పండుగ.. రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన గాలిపటాలు

#SankranthiSpecial: సంక్రాంతి పండుగ.. రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన గాలిపటాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 15, 2026
01:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

మకర సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఢిల్లీ, గుజరాత్ వంటి ప్రధాన నగరాల్లో కూడా ఆకాశం నిండా గాలిపటాలు ఎగురుతూ పండుగ వాతావరణం కనిపిస్తోంది. 2026 జనవరి 15న సంక్రాంతి వేడుకలు అత్యంత ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగురవేయడం అనేది పురాతన సంప్రదాయమని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆచారం త్రేతాయుగం నుంచే ప్రారంభమైందని, రామాయణ కాలం నుంచి కొనసాగుతోందని విశ్వసిస్తారు. అలాగే మొఘలుల పాలన కాలంలోనూ సంక్రాంతి సందర్భంగా గాలిపటాలు ఎగురవేశారన్న ఆధారాలు చరిత్రకారులు ప్రస్తావిస్తున్నారు.

వివరాలు 

త్రేతాయుగంలో గాలిపటాలు ఎగురవేసిన శ్రీరాముడు

మకర సంక్రాంతి తెలుగు ప్రజలకు అత్యంత ముఖ్యమైన పండుగ.ఈ పండుగకు గాలిపటాల ఆట విడదీయరాని భాగంగా మారింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ రంగురంగుల గాలిపటాలు ఎగురవేస్తూ ఆనందంగా వేడుకలు జరుపుకుంటారు. ఇళ్ల పైకప్పులు, ఖాళీ ప్రదేశాలు, మైదానాలు అన్నీ పండుగ సందడితో నిండిపోతాయి. త్రేతాయుగంలో శ్రీరాముడు కూడా గాలిపటాలు ఎగురవేశారని పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం శ్రీరాముడు తన సోదరులతో కలిసి గాలిపటాలు ఎగురవేసినట్లు కథనాలు ఉన్నాయి. తమిళ రామాయణం ప్రకారం మకర సంక్రాంతి రోజు మొదటగా గాలిపటాలు శ్రీరాముడు ఎగుర వేశారని.. వారి గాలిపటం ఎంత ఎత్తుకు ఎగిరిందంటే .. ఆ గాలి పటం ఇంద్రలోకానికి చేరిందని చెబుతారు.

వివరాలు 

గాలిపటాలు ఎగురవేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు

అప్పటి నుంచి సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగురవేయడం ఒక సంప్రదాయంగా మారింది. తులసీదాస్ రచించిన రామచరితమానస్‌లోని బాలకాండలో కూడా శ్రీరాముడు తన సోదరులతో కలిసి గాలిపటం ఎగురవేసిన సందర్భాలను ప్రస్తావించినట్లు తెలుస్తుంది. గాలిపటాలు ఎగురవేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మకర సంక్రాంతి తరువాత చలి తీవ్రత తగ్గడం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో గాలిపటాలు ఎగురవేయడం చేతులు, కాళ్లకు మంచి వ్యాయామంగా పనిచేస్తుంది. బయట ఎండలో ఉండడం వల్ల సూర్యకిరణాలు శరీరానికి అందుతాయి. దీని ద్వారా విటమిన్-డి లభించి శక్తి పెరుగుతుంది. చర్మ సంబంధిత సమస్యలు తగ్గి, మొత్తం శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు.

Advertisement

వివరాలు 

 గాలిపటాలను భారతదేశానికి పరిచయం చేసిన చైనా యాత్రికులు

గాలిపటాలకు మరో విశేషమైన చరిత్ర కూడా ఉంది. వీటికి సుమారు రెండువేల సంవత్సరాల చరిత్ర ఉందని తెలుస్తోంది. మొదట్లో గాలిపటాలను దేశాల మధ్య సమాచారాన్ని పంపేందుకు ఉపయోగించేవారని చరిత్ర చెబుతోంది. చైనా యాత్రికులు ఫా-హియెన్, జువాన్‌జాంగ్ గాలిపటాలను భారతదేశానికి పరిచయం చేశారని భావిస్తున్నారు. యుద్ధభూముల్లో సందేశాల పంపకానికి వీటిని వినియోగించేవారు. తరువాత మొఘలుల కాలంలో ఢిల్లీలో గాలిపటాల పోటీలు ఘనంగా నిర్వహించేవారు. క్రమంగా గాలిపటాల ఆట భారతీయుల ఇళ్లలో ఒక వినోదంగా మారింది. అందుకే సంక్రాంతి పండుగ వేడుకల్లో భాగంగా గాలిపటాలు ఎగురవేస్తూ ఆనందంగా పండుగను జరుపుకుంటున్నారు.

Advertisement