
Plants In Summer: వేసవిలో ఎండిపోతున్న మొక్కలను కాపాడుకోవడానికి ఈ చిట్కాలను పాటించండి!
ఈ వార్తాకథనం ఏంటి
మీరు మొక్కలను ప్రేమిస్తే, మీ ఇంట్లో అనేక రకాల మొక్కలను పెంచుకుంటే, వేసవి కాలంలో వాటిని సంరక్షించడం ఎంత కష్టమో మీకు తెలుసు.
ఎండలు అధికంగా ఉండటంతో, వేడిగా ఉండే గాలులతో మనమే ఇబ్బంది పడితే, మొక్కల పరిస్థితి ఏమిటి? నిజంగా వేసవి కాలం మొక్కలకు ఒక పెద్ద సవాలు.
తీవ్రమైన సూర్యకాంతి వల్ల మొక్కలు ఎండిపోవడం, ఆకులు రాలిపోవడం, కొన్నిసార్లు పూర్తిగా నీరసించిపోవడం జరుగుతుంది.
ఇలాంటి సమస్యలు రాకుండా, వేసవిలో మొక్కలను ఆరోగ్యంగా పెంచుకునేందుకు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిని ఇప్పుడు తెలుసుకుందాం.
వివరాలు
1. వేసవిని తట్టుకునే మొక్కలను పెంచండి
వేసవిలో మొక్కల సంరక్షణను సులభతరం చేయాలంటే, అధిక వేడిని తట్టుకునే మొక్కలను పెంచడం ఉత్తమమైన పరిష్కారం. మీ గార్డెన్‌లో లేదా బాల్కనీలో పామ్ చెట్లు, మల్లెపూల మొక్కలు, కలబంద వంటి వేడి సహించే మొక్కలను పెంచండి. ఇవి సంవత్సరం పొడవునా ఆకుపచ్చగా ఉంటాయి.
2. వేసవి మొదలుకాకముందే మట్టి మార్చాలి
మొక్కల ఆరోగ్యాన్ని కాపాడేందుకు, వేసవి రాకముందే కొత్త మట్టిని ఉపయోగించడం చాలా అవసరం. మొక్కలను తాజా మట్టి, కొత్త ఎరువులతో పెద్ద పాత్రల్లో నాటితే, అవి వేడి ప్రభావానికి తట్టుకుని ఆరోగ్యంగా పెరుగుతాయి.
వివరాలు
3. నీరు పోయే విధానం
వేసవిలో మొక్కలకు నీటిని సరైన సమయంలో, సరైన విధంగా పోయాలి.
ఎప్పుడు పోయాలి?
తెల్లవారుజామున లేదా సాయంత్రం నీటిని పోయడం మంచిది. మట్టి పూర్తిగా ఎండిపోకుండా ఉండేలా చూడాలి.
ఏం చేయకూడదు?
అధికంగా నీరు పోస్తే, వేర్లు కుళ్ళిపోతాయి. మధ్యాహ్నం వేళల్లో నీరు పోస్తే, వేడి వల్ల వెంటనే ఆవిరైపోతుంది.
వివరాలు
4. నీడ పడేలా చూడండి..
వేసవిలో ముఖ్యంగా మధ్యాహ్నం 11 గంటల నుండి 3 గంటల వరకు తీవ్రమైన సూర్యకాంతి మొక్కలపై నేరుగా పడకూడదు.
మొక్కలను రక్షించే మార్గాలు: మొక్కలను గుడ్డలతో లేదా నెట్ షేడ్స్‌తో కప్పడం. తేలికపాటి చాపల కింద పెట్టడం. కుండీలను నీడ పట్టే ప్రదేశానికి మార్చడం.
5. అధిక ఎరువులు
ఎరువులు మొక్కల పెరుగుదలకు అవసరమే కానీ వేసవికాలంలో అధికంగా వేయడం వల్ల వాటిపై ఒత్తిడి పెరుగుతుంది. కనుక, చాలా తక్కువగా,తగిన పరిమాణంలో మాత్రమే ఎరువులను అందించాలి.
6. గాలి తాకనివ్వండి
వేసవిలో సాయంత్రం సమయంలో గాలి కాస్త చల్లగా ఉంటుంది. కనుక, మొక్కలపై కప్పిన గుడ్డలను సూర్యాస్తమయం తర్వాత తీసివేయడం మంచిది. తాజా గాలి అందకపోతే, మొక్కలు నీరసించి పోతాయి.
వివరాలు
7. ఆకులకు కూడా నీరు
మట్టిలో మాత్రమే నీరు పోయడం కాకుండా, ఆకుల మీద కూడా నీరు చల్లడం అవసరం.
ఎలా చేయాలి?
రోజుకు కనీసం ఒకసారి స్ప్రే బాటిల్ ద్వారా నీటి చినుకులను చల్లాలి. ఎక్కువ వేడిగా ఉన్న రోజులలో, రోజుకు రెండు సార్లు నీరు చల్లడం మంచిది.
8. శాఖలను తొలగించడం
పసుపు రంగులో మారిన ఆకులు,ఎండిపోయిన ఆకులు మొక్క శక్తిని దొంగిలిస్తాయి.కనుక, వాటిని తరచుగా తొలగించండి.
ఇది మొక్క ఆరోగ్యంగా ఎదగడానికి సహాయపడుతుంది.
వేసవి కాలం మొక్కలకు పెద్ద పరీక్షే అయినా, సరైన జాగ్రత్తలు తీసుకుంటే అవి ఆరోగ్యంగా పెరుగుతాయి. వీటి ద్వారా మీ మొక్కలను ఎండాకాలం అంతటా ఆకుపచ్చగా ఉంచగలుగుతారు!