మీ చర్మం అందంగా మెరిసిపోవాలా? నువ్వులతో ఇలా ట్రై చేయండి
నువ్వులను సాధారణంగా రకరకాల ఆహార పదార్థాలను తయారు చేయడంలో ఉపయోగిస్తారు. ముఖ్యంగా స్వీట్లు, లడ్డూలు వంటి వాటిని తయారు చేయడంలో నువ్వులను ఉపయోగిస్తారు. నువ్వులను కొందరు కూరల్లో కూడా వేస్తారు. ఆయుర్వేదంలో నువ్వులకు చాలా ప్రాధాన్యత ఉంది. నువ్వులను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు. అంతేకాదు మసాజ్ చేయడానికి నువ్వుల నూనె సరైనదని నిపుణులు చెబుతున్నారు. నువ్వుల్లో ఒమేగా సిక్స్ ఫ్యాటీ ఆమ్లాలు, ఆంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫ్లేవనాయిడ్స్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇంకా విటమిన్ బి, క్యాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, ఫాస్పరస్ వంటి మూలకాలు నువ్వుల్లో దొరుకుతాయి.
చర్మానికి నువ్వులు చేసే మేలు
ఎండ కారణంగా మీ చర్మం దాని రంగును కోల్పోతే నువ్వుల ద్వారా తిరిగి సాధారణ స్థితికి మార్చవచ్చు. దానికోసం ఏం చేయాలంటే, కొద్దిగా నువ్వులు, ఎండిపోయిన పుదీనా, ఒక చెంచా నిమ్మరసం, తేనె తీసుకోవాలి. నువ్వులను, పుదీనాను పొడిగా చేసి ఒక దగ్గర కలపాలి. ఇప్పుడు దానిలో నిమ్మరసం, తేనె కూడా కలిపి చేతులకు ముఖానికి అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని నిమిషాలకు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల మీ చర్మం తళతళ మెరిసిపోతుంది. నువ్వుల వల్ల చర్మ ప్రయోజనాలే కాదు జుట్టు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చుండ్రు సమస్య ఎక్కువగా ఉన్నవారు నువ్వుల నూనె వాడటం వల్ల ఆ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.