Parenting: ఆరుబయట ఆడుకునే పిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.. బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం పరిశోధన
పిల్లల ఆటలు గతంలో చాలావరకు ఆరుబయటే ఉండేవి. 2000 సంవత్సరం వరకు పిల్లల జీవనశైలి ఆరోగ్యకరంగా ఉండేది, వారు రోజు అంతా మైదానాల్లో గడిపేవారు. అయితే, నేటి పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు తమ "గ్రౌండ్" గా మారిపోయాయి. వీడియోగేమ్స్ ఇప్పుడు వారి ఆటగా మారాయి. కానీ, బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం చేసిన పరిశోధన ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెలికితీసింది. ఆరుబయట ఆడే పిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని, వీటి ద్వారా శారీరక ఆరోగ్యం పెరిగేంతవరకు సామాజిక నైపుణ్యాలు కూడా మెరుగవుతాయని పేర్కొంది.
పిల్లల స్క్రీన్ టైమ్ గురించి ఆందోళన
నేటి రోజుల్లో పిల్లల జీవనశైలి పూర్తిగా మారిపోయింది. గతంలో టీవీ మాత్రమే వారు ఎంటర్టైన్‌మెంట్‌కు ఉపయోగించుకునేవారు. సినిమాలు చూడడానికి ఆదివారమే ! కానీ ఇప్పటి పిల్లలు తమ సమయాన్ని పూర్తిగా స్క్రీన్ల ముందు గడిపేస్తున్నారు. స్క్రీన్‌లోనే ఆటలు, పాఠాలు ఇమిడిపోయాయి. స్మార్ట్‌ఫోన్‌లు,ట్యాబ్లెట్‌లు,కంప్యూటర్లు వంటివి పిల్లల జీవితంలో భాగమయ్యాయి. ఈ స్క్రీన్ల వినియోగం వారిలో అనారోగ్య సమస్యలను కలిగిస్తున్నదని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రస్తుతం 61%మంది తల్లిదండ్రులు తమ పిల్లల స్క్రీన్ టైమ్ గురించి ఆందోళన చెందుతున్నట్లు వివిధ అధ్యయనాలు తేల్చాయి. సమాజంలో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ఆధారిత ప్రపంచం బాల్యాభివృద్ధికి ప్రతికూలంగా మారుతున్నది, తద్వారా వారి భాషాభివృద్ధి,మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
పుస్తకాలే నేస్తాలు..
అందుకే, పిల్లల స్క్రీన్ టైమ్‌ను తగ్గించి, వారిని ఆరుబయట ఆడుకునేలా ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. నైంటీస్ కిడ్స్ దాచుకున్న స్లామ్‌బుక్స్‌ను ఒక్కసారి తిరగేయండి. చాలా పేజీల్లో హాబీస్ దగ్గర.. 'రీడింగ్ బుక్స్' అనే కనిపిస్తుంది. పుస్తకాలే నేస్తాలుగా గడిచిన బాల్యం వాళ్లది. చందమామ కథలు చదువుతూ.. నిద్రలోకి జారుకున్న తరం వాళ్లది. మరిప్పుడో.. స్కూల్ బుక్స్, హోమ్ వర్క్ తప్ప, వేరే పుస్తకమే తెలియకుండా రోజులు గడిపేస్తున్నారు. కాబట్టి.. మీ పిల్లల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంచండి. ప్రతిరోజూ పడుకునే ముందు.. వారికి ఒక మంచి పుస్తకం ఇచ్చి చదవమనండి. పుస్తకాలు చదవడం వల్ల వారిలో ఆలోచనా శక్తి పెరుగుతుంది. భాషా నైపుణ్యాలూ మెరుగుపడుతాయి.
ప్రకృతి ప్రేమికులు..
నాటికాలం పిల్లలు.. ప్రకృతి ప్రేమికులు. చుట్టూ ఉండే చెట్టూ చేమల్ని చూసే ఎక్కువగా నేర్చుకున్నారు. నేటితరానికి ఇల్లు, స్కూలూ తప్ప.. వేరే ప్రాంతం పెద్దగా తెలియదు. అయితే.. ప్రకృతితో మమేకమైతేనే.. పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది. సమస్య-పరిష్కార సామర్థ్యాలు మెరుగుపడతాయన్న విషయం తల్లిదండ్రులు గుర్తించాలి. అందుకే.. ప్రకృతిలో ఉన్న వింతలను, సహజత్వాన్ని పిల్లలకు అలవాటు చేయాలి. వైరస్‌లు, బ్యాక్టీరియాలు అంటూ భయపెట్టకుండా.. పిల్లల్ని స్వేచ్ఛగా మట్టిలో ఆడుకోనివ్వాలి. నీళ్లలో గెంతనివ్వాలి. ప్రకృతిని ప్రేమించేలా.. వారిని ప్రోత్సహించడం చాలా అవసరం.
బంధాలతో అనుబంధం
90వ దశకంలో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి.ఏ పండుగ వచ్చినా ఇళ్లలో అందరి అనుబంధాలు,కలబోతతో కళకళలాడేవి. కానీ,నేటి రోజుల్లో నలుగురు కలిసి ఒక ఇంట్లో ఉండటం చాలా అరుదైన విషయం అయింది. ఈ తరానికి సంబంధించి,కుటుంబంతో సమయం గడపడం కంటే సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ సమయం గడుపుతున్నది. ఫలితంగా, మనిషికి కావలసిన సహజ భావోద్వేగాలు తగ్గిపోతున్నాయి. ఈ మార్పు వారి భవిష్యత్తులో అనేక విపత్కర పరిస్థితులకు దారితీస్తుంది. కాబట్టి, పిల్లల మధ్య ప్రేమ, అనురాగాలను పెంచడం చాలా అవసరం. వారితో రోజుకు కనీసం ఒకసారి, కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేయాలని ప్రణాళికలు వేసుకోవాలి. అన్నదమ్ముల పిల్లల మధ్య తరచూ కలుసుకునే అవకాశాలు కల్పించడం వల్ల వారికి బంధాల విలువ అర్థమవుతుంది.