జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు?
విటమిన్లు, ప్రొటీన్లు, కాల్షియం, ఇతరత్రా అనేక ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నందున పాలను సమతుల్య ఆహారంగా పరిగణిస్తారు. అన్ని వయసుల వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో పాలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతిఏటా జూన్ 1న ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏఓ) ఆధ్వర్యంలో ప్రపంచ పాల దినోత్సవం జరుపుకుంటారు. ఈ క్రమంలో గురువారం పాల దినోత్సవం సందర్భంగా worldmilkday.org ఈఏడాది థీమ్‌ను ప్రకటించింది. 'పాడి పర్యావరణం పరిరక్షణలో పాడి పాత్ర తగ్గినా, పోషకాహారం, జీవనోపాధి అందిస్తూనే ఉంది' అనే థీమ్‌ను వెల్లడించింది.
పాల దినోత్సవం చరిత్ర
2001 సంవత్సరంలో ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ప్రపంచ పాల దినోత్సవాన్ని మొదటిసారిగా ప్రకటించింది. ప్రపంచ ఆహారంగా పాలు ప్రాముఖ్యతను తెలియజేయడానికి, పోషకాహారాన్ని ప్రోత్సహించడంతో పాటు జీవనోపాధికి మద్దతు ఇవ్వడంలో పాడి పరిశ్రమల పాత్రను హైలైట్ చేయడానికి ఈరోజును ఉపయోగిస్తారు. ఎఫ్ఏఓ తన మొట్టమొదటి ప్రపంచ పాల సమావేశాన్ని జూన్ 1, 2001న నిర్వహించింది. అందుకే ప్రపంచ పాల దినోత్సవాన్ని జూన్ 1న జరుపుకుంటారు.
జూన్ 1న ఏం చేస్తారు?
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పాడి పరిశ్రమ పాత్రను వివరించడం. పాల పరిశ్రమలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ఈ విషయంపై అవగాహన కల్పించడం. పాడి పరిశ్రమలు గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం, జంతు సంక్షేమాన్ని ప్రోత్సహించడం, నీటి వినియోగాన్ని మెరుగుపరచడం, వంటి స్థిరమైన పద్ధతులను అవలంబిస్తాయి. పాల వినియోగం వల్ల కలిగే పోషక ప్రయోజనాల గురించి వినియోగదారుల్లో అవగాహన కల్పిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆరు బిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు పాల ఉత్పత్తులను తింటున్నారు.