LOADING...
Antibiotics: యాంటీబయోటిక్స్‌ను అతిగా వాడుతున్నారా?.. డాక్టర్ల కీలక సూచనలు!
Antibiotics: యాంటీబయోటిక్స్‌ను అతిగా వాడుతున్నారా?.. డాక్టర్ల కీలక సూచనలు!

Antibiotics: యాంటీబయోటిక్స్‌ను అతిగా వాడుతున్నారా?.. డాక్టర్ల కీలక సూచనలు!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2025
05:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుత కాలంలో అనేక రకాల ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో కొందరు డాక్టర్ సలహా లేకుండానే యాంటీబయాటిక్స్ ను స్వేచ్ఛగా వాడేస్తుంటారు. ఈ అలవాటుపై వైద్య నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. యాంటీబయాటిక్ మందులు తీసుకున్నా కూడా సూక్ష్మజీవులు చనిపోకుండా మరింత పెరిగి ప్రభావం చూపే పరిస్థితిని యాంటి మైక్రోబయల్ రెసిస్టెన్స్ (AMR) అని అంటారు. ఈ విషయంపై ఆస్టర్ ప్రైమ్ ఆసుపత్రిలో ఇన్ఫెక్షన్ నియంత్రణ నిపుణురాలు, కన్సల్టెంట్ మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ ఆర్సీ బిలోరియా వివరణాత్మకంగా తెలియజేశారు.

వివరాలు 

ప్రాణాధార వైద్యం కూడా ప్రమాదంలో పడే అవకాశం

ప్రతి సంవత్సరం నవంబర్ 18 నుంచి 24 వరకు ప్రపంచవ్యాప్తంగా ఏఎంఆర్ అవగాహన వారోత్సవం (WAAW) నిర్వహిస్తారు. ఈ ఏడాది థీమ్ —"ఇప్పుడే స్పందించండి: మ‌న వ‌ర్తమానాన్ని ర‌క్షించి, భ‌విష్యత్తును కాపాడుకోండి." ఈ సందేశం ఏఎంఆర్‌ను అరికట్టడానికి ధైర్యవంతమైన, సమన్వయంతో కూడిన, విభిన్న రంగాల సహకారంతో తీసుకోవాల్సిన చర్యల కీలకతను గుర్తు చేస్తుంది. ఇప్పటికే ఏఎంఆర్ మన ఆరోగ్యం, ఆహార భద్రత, జీవ పరిసరాలు,ఆర్థిక వ్యవస్థలపై గణనీయ ప్రభావం చూపుతున్న ప్రపంచ సమస్యగా మారింది. యాంటీబయాటిక్స్ ప్రాణాలకు అవసరమైన ఔషధాలు. కానీ, అవి ఇన్ఫెక్షన్ క‌ల‌గ‌జేసే సూక్ష్మజీవుల మీద ప‌నిచేస్తేనే ప్రాణాల‌ను కాపాడ‌తాయి. ఇవి సరిగా పనిచేయకపోతే క్యాన్సర్ చికిత్సలు,అవయవ మార్పిడి వంటి ప్రాణాధార వైద్యం కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

వివరాలు 

యాంటీబయాటిక్స్ రాయకపోతే, బలవంతం చేయకూడదు

యాంటీబయాటిక్స్ ను సూచించిన సమయంలో పూర్తిగా వాడకపోవడం, సరైన డోసులో తీసుకోకపోవడం, ఏ వ్యాధికి ఏ మందు అవసరమో తెలియకుండానే ఉపయోగించడం.. ఇవన్నీ తప్పు వినియోగంలో భాగమే. వైద్యులు సూచించినపుడే వాటిని తీసుకోవాలి. వైద్యులు యాంటీబయాటిక్స్ రాయకపోతే, బలవంతం చేయకూడదు. వేరేవారికి రాసిన మందులు మీకు సరిపోతాయని భావించి వాడకూడదు. ప్రతి వ్యక్తికి చికిత్స, డోసు వేరు. మన దేశంలో ప్రిస్క్రిప్షన్ లేకుండానే దుకాణాల్లో యాంటీబయాటిక్స్ సులభంగా దొరుకుతుండటం కూడా దుర్వినియోగానికి ప్రధాన కారణమని డాక్టర్ బిలోరియా తెలిపారు. కొత్త యాంటీబయాటిక్స్ తయారీ చాలా క్లిష్టమైనది, ఖరీదైనది. మార్కెట్లోకి రావడానికి ఏళ్ల సమయం పడుతుంది. అందుకే కొత్త మందులు తగ్గిపోతున్నాయి. ఉన్న యాంటీబయాటిక్స్ ను జాగ్రత్తగా వాడుతూ కాపాడుకోవడం అత్యంత ముఖ్యం.

వివరాలు 

టీకాలు తప్పనిసరి 

చాలా టీకాలు బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి. ఇన్ఫెక్షన్ రాకపోతే యాంటీబయాటిక్స్ అవసరమే ఉండదు కాబట్టి, పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ సమయానికి టీకాలు వేయించుకోవడం అత్యంత ముఖ్యం. ఏఎంఆర్‌ నిరోధానికి పాటించాల్సిన మార్గాలు వైద్యులు అవసరమని చెప్పకపోతే యాంటీబయాటిక్స్ కోసం ఒత్తిడి చేయకండి. మందుల దుకాణంలో యాంటీబయాటిక్స్ కొనాలంటే తప్పనిసరిగా ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్లండి. వైద్యులు సూచించిన విధంగానే, సూచించిన కాలం పాటు యాంటీబయాటిక్స్ వాడాలి; మధ్యలో ఆపకూడదు. మిగిలిపోయిన యాంటీబయాటిక్స్‌ను మళ్లీ వాడకండి; మరెవరికి ఇవ్వకండి. రోజూ చేతులు కడుక్కోవడం, ఆహారాన్ని శుభ్రంగా వండడం, అనారోగ్యంతో ఉన్న వారితో దూరం పాటించడం, దగ్గు వచ్చినప్పుడు నోరు కప్పుకోవడం, క్రమం తప్పకుండా టీకాలు తీసుకోవడం వంటివాటితో ఇన్ఫెక్షన్లను నియంత్రించవచ్చు.

వివరాలు 

యాంటీబయాటిక్స్ వినియోగంలో కీలకం

వైద్యులపరంగా చూస్తే.. సరైన మందు, సరైన డోసు, సరైన సమయం, సరైన కాలవ్యవధి అన్నవే యాంటీబయాటిక్స్ వినియోగంలో కీలకం. వీలైనంత తక్కువకాలం వాడటం మంచి వ్యూహం. సరైన చికిత్స ఇచ్చినపుడే యాంటీబయాటిక్స్ దుష్ఫలితాలు తగ్గుతాయి, ఏఎంఆర్ కూడా ఆగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.