Foods: నోరూరించే 'డ్రైఫ్రూట్స్ మైసూర్ పాక్'.. సులభంగా చేసుకోండిలా
ఈ వార్తాకథనం ఏంటి
మైసూర్ పాక్ అనేది చాలామందికి ఇష్టమైన మిఠాయి. దీని రుచి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎక్కువ మంది దీనిని తినాలనిపిస్తే స్వీట్ షాపుల్లోనే కొనుగోలు చేస్తుంటారు. కొందరు మాత్రమే ఇంట్లో తయారు చేస్తారు. అందుకే ఈరోజు ప్రత్యేకంగా డ్రైఫ్రూట్స్ మైసూర్ పాక్ తయారీ విధానాన్ని తెలుసుకుందాం. ఈ విధంగా చేస్తే షాప్‌లో దొరికేదానికంటే ఇంకా రుచిగా, మృదువుగా వస్తుంది. ముఖ్యంగా ఇది చేయడానికి ఎక్కువ శ్రమ అవసరం లేదు. చాలా తక్కువ పదార్థాలతో తక్కువ సమయంలోనే సిద్ధమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీ కుటుంబ సభ్యులకు తీపి రుచి చూపించండి.
వివరాలు
కావాల్సిన పదార్థాలు ఇవే..
నెయ్యి - 2½ కప్పులు పంచదార - 2 కప్పులు శనగపిండి - 1½ కప్పులు బాదం, జీడిపప్పు, పిస్తా తరుగు - 3 టేబుల్ స్పూన్లు
వివరాలు
తయారీ విధానం ఇదే..
ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయిలో రెండున్నర కప్పుల నెయ్యి వేసి లో ఫ్లేమ్‌లో వేడి చేయాలి. అదే సమయంలో బాదం, జీడిపప్పు, పిస్తా పలుకులను చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇంకో స్టవ్‌పై పాన్ పెట్టి అందులో రెండు కప్పుల పంచదారతో పాటు పావు కప్పు నీళ్లు వేసి కరిగించాలి. పంచదార పూర్తిగా కరిగి లేత పాకం వచ్చాక అందులో శనగపిండిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు పడకుండా కలపాలి. శనగపిండి బాగా కలిసిన తర్వాత ముందుగా వేడి చేసిన నెయ్యిని కొంచెం కొంచెంగా పోస్తూ కలుపుతూ ఉండాలి. నెయ్యిని ఒకేసారి కాకుండా ప్రతి 2-3 నిమిషాలకు కొద్దిగా వేసుకుంటే మిశ్రమంలో బుడగలు ఏర్పడతాయి.
వివరాలు
డ్రైఫ్రూట్స్‌తో ఇలా చేస్తే అద్భుత రుచి..
మిశ్రమం పూర్తిగా ఉడికిన తర్వాత నెయ్యి రాసిన ప్లేట్‌లోకి తీసుకోవాలి. పైగా తరిగిన డ్రైఫ్రూట్స్ చల్లి సుమారు 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత మీకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే, రుచికరమైన డ్రైఫ్రూట్స్ మైసూర్ పాక్ సిద్ధం అవుతుంది. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్‌టైట్ డబ్బాలో నిల్వ ఉంచితే దాదాపు 15 రోజుల వరకు తాజాగా ఉంటాయి.
వివరాలు
ఈ చిట్కాలు పాటిస్తే మరింత రుచి, తాజాదనం
ఈ స్వీట్ కోసం తప్పనిసరిగా మందపాటి కడాయినే ఉపయోగించాలి. పలుచని పాన్ వాడితే మైసూర్ పాక్ కాలిపోయే అవకాశం ఉంది. శనగపిండిని కొలిచిన కప్పుతోనే పంచదారను కూడా కొలవడం మంచిది. పాకం సరైన దశలో ఉందో లేదో తెలుసుకోవాలంటే కొద్దిగా పాకాన్ని తీసుకుని రెండు వేళ్ల మధ్య పట్టుకుని లాగితే తీగలా లాగాలి. నెయ్యి బాగా వేడి ఉండాలి. లేదంటే మైసూర్ పాక్ సరైన టెక్స్చర్‌తో రాదు.