
Teachers Day 2025: ఉపాధ్యాయ దినోత్సవం 2025.. ఈ రోజు ప్రాముఖ్యత ఏమిటో మీకు తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తారో, ఉపాధ్యాయులు కూడా అంతే ప్రాధాన్యత కలిగివుంటారు. పాఠ్యాంశాల బోధనతో పాటు, జీవన విలువలను బోధిస్తూ మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేస్తారు. విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలిచి, జ్ఞానాన్ని పంచుతూ నిస్వార్థంగా వారి భవిష్యత్తును నిర్మించే ఉపాధ్యాయులను గౌరవించడానికి మన దేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మరి ఈ రోజును ఎందుకు జరుపుకుంటామో, దాని నేపథ్యం ఏమిటో తెలుసుకుందాం.
Details
ఎందుకు జరుపుకుంటారు?
భారతదేశ రెండో రాష్ట్రపతి, మొదటి ఉపరాష్ట్రపతి, గొప్ప పండితుడు, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. జీవితమంతా విద్యార్థుల్లో జ్ఞానాన్ని పెంపొందించడంలో, జాతీయ భావాన్ని నాటడంలో ఆయన విశేష కృషి చేశారు. విద్యకు ఆయన చేసిన సేవలను స్మరించడమే కాకుండా, విద్యార్థుల భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేసే ఉపాధ్యాయుల అంకితభావాన్ని గౌరవించడానికే ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
Details
ఉపాధ్యాయ దినోత్సవ నేపథ్యం
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశానికి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు, ఆయన పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకోవాలని కొంతమంది విద్యార్థులు, స్నేహితులు కోరుకున్నారు. అయితే, రాధాకృష్ణన్ స్పందిస్తూ - *"నా పుట్టినరోజు జరుపుకోవడం కన్నా, ఆ రోజును ఉపాధ్యాయుల కృషిని గుర్తించే దినోత్సవంగా జరుపుకుంటే నాకు మరింత ఆనందంగా ఉంటుందన్నారు. ఆయన సూచనతోనే సెప్టెంబర్ 5ని ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించి దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
Details
ఉపాధ్యాయ దినోత్సవ ప్రాముఖ్యత
భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యున్నత స్థానం ఉంది. ఉపాధ్యాయులు విద్యార్థులకు పుస్తకాల జ్ఞానమే కాకుండా, నైతిక విలువలు, జీవన పాఠాలు, క్రమశిక్షణను నేర్పుతారు. ఒక్కో విద్యార్థి భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అపారమైంది. సమాజానికి మంచి పౌరులను అందించడమే ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశ్యం. ఈ రోజున దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు ఉపాధ్యాయులను సత్కరించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదనంగా, ప్రతిభావంతులైన ఉపాధ్యాయులకు భారత రాష్ట్రపతి జాతీయ ఉపాధ్యాయ అవార్డులు అందజేస్తారు.