Bonalu 2026 Schedule: జూలై 16 నుంచి బోనాలు.. పూర్తి షెడ్యూల్, ఏర్పాట్ల వివరాలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్ర ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల జాతరను అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో బోనాల ఉత్సవాలు జరుగనున్నాయన్నారు. ఈ నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు ఆలయాలకు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
వివరాలు
బోనాల ఉత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లు..
జూలై 16న గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలతో ప్రారంభంకానున్నాయి.
జూలై 20, 21, 22 తేదీల్లో బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవ ఉత్సవాల్లో భాగంగా 20వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఎదుర్కోలు ఉత్సవం, 21న అమ్మవారి కళ్యాణం, 22న రథోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది.
ఆగస్టు 2న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో బోనాలు, ఆగస్టు 3న రంగం కార్యక్రమం ఉంటుంది.
ఆగస్టు 9న హైదరాబాద్ నగరంలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలతో పాటు, నగరంలోని ప్రధాన దేవాలయాల్లో జరిగే బోనాల ఉత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు మంత్రి పొన్నం వెల్లడించారు.
వివరాలు
అధికారులకు ఆదేశాలు జారీ..
బోనాల ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
ఉత్సవాల కోసం దేవాదాయ శాఖ, జీహెచ్‌ఎంసీ, పోలీస్ శాఖ, రోడ్లు, భవనాల శాఖ, ట్రాన్స్‌కో, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు, టీజీఎస్‌ఆర్టీసీ, రైల్వే, పురావస్తు శాఖతో పాటు ఇతర అన్ని ప్రభుత్వ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు.
దేవాలయాల వద్ద క్యూ లైన్లు, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా, రహదారుల మరమ్మతులు, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సేవలు, భద్రత, ప్రత్యేక బస్సుల నిర్వహణ, పూల అలంకరణలు, విద్యుద్దీపాలంకరణలు వంటి అన్ని ఏర్పాట్లు త్వరైతగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.