Telugu Freedom Fighters: స్వాతంత్య్ర సమరంలో తెలుగు వీరుల పాత్ర
ఎందరో వీరుల త్యాగ ఫలమే నేడు మనం అనుభవిస్తున్నఈ స్వాతంత్య్రం. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం పోరాడిన మహానుభావులు ఎందరో ఉన్నారు. ఆ స్వాతంత్య్ర సమరంలో తెలుగు వారు కూడా ప్రత్యేక స్థానాన్నిసొంతం చేసుకోడమే కాదు దేశ సేవకు మారుపేరుగా నిలిచారు. భారతదేశ స్వాతంత్య్ర సమరంలో తెలుగు వారు చూపించిన వీరత్వం, త్యాగాలు నిజంగా అద్భుతమైనవి. ఈ వీరులను స్మరించుకుంటూ, వారి త్యాగాలను గౌరవిస్తూ ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం.
టంగుటూరి ప్రకాశం పంతులు: ఆంధ్ర కేసరి
ఆంధ్రుల ఆత్మగౌరవం,స్వాతంత్య్ర సమరంలో టంగుటూరి ప్రకాశం పంతులు పాత్ర అనిర్వచనీయం. ఒక పేద కుటుంబంలో జన్మించిన ప్రకాశం పంతులు,కష్టపడి చదివి న్యాయవాది అయ్యారు.తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసుకున్న ఆయన, స్వాతంత్ర్య సమరంలో చురుగ్గా పాల్గొన్నారు. 1907లో'సూరత్ విభజన'తర్వాత..టంగుటూరి ప్రకాశం కాంగ్రెస్‌కు చురుకైన అనుచరుడిగా మారారు. అనంతరం,మహాత్మా గాంధీ ప్రేరణతో..న్యాయవాదిగా తన వృత్తిని త్యజించి పూర్తిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1921 అక్టోబర్ 29న'స్వరాజ్య'అనే ఇంగ్లీష్ దినపత్రికను స్థాపించారు.ఆయన ప్రచురణకు వర్కింగ్ ఎడిటర్‌గా కూడా ఉన్నారు.1936లో స్వరాజ్య మూతపడింది. ప్రకాశం పంతులుని 'ఆంధ్ర కేసరి' అని అభిమానులు పిలుస్తారు. ఆయన నిజాయితీ, నిష్ఠ, ప్రజాస్వామ్య విలువలకు ప్రతీక. ఆయన జీవితం, ఆంధ్ర ప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తుంది.
అల్లూరి సీతారామరాజు: మన్యం వీరుడు
ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతమైన మన్యంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసి, ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన మహానుభావుడు అల్లూరి సీతారామరాజు. అల్లూరి 1897 జులై 4న విశాఖపట్నం జిల్లాలోని భీమునిపట్నంలో జన్మించారు.తన చిన్నతనం నుంచే దేశభక్తితో నిండి ఉన్నఅయన,అడవి జీవనం గడిపారు. గిరిజనుల హక్కుల కోసం పోరాడి,వారికి ఆధ్యాత్మిక గురువుగా కూడా వ్యవహరించారు.బ్రిటిష్ పోలీస్ స్టేషన్ల నుంచి ఆయుధాలు దొంగలించి వాటితోనే వారిపై పోరాటం చేసిన మన్యం వీరుడు. ఆయన నాయకత్వంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధం చేశారు.అనేక పోలీస్ స్టేషన్లపై దాడి చేసి,ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
బెంగాల్ విప్లవకారుల నుండి ప్రేరణ
అల్లూరి సీతారామరాజు తన సాయుధ పోరాటంతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూల్చివేశారు. అయన వీరత్వం తెలుగు ప్రజలందరికీ స్ఫూర్తిగా నిలిచింది. 1924 మే 7న పోలీసులతో జరిగిన కాల్పుల్లో అల్లూరి సీతారామరాజు వీరమరణం పొందారు. కెఎల్ పురం కొండ ప్రాంతంలో ఆయనను దహనం చేశారు. బెంగాల్ విప్లవకారుల నుండి ప్రేరణ పొందిన అయన బ్రిటీష్ వారి వివక్షాపూరిత పద్ధతులకు వ్యతిరేకంగా పోరాడటానికి రంపా తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి: తెలుగు వీరుడు
తెలుగుజాతి స్వాతంత్య్ర సమరయోధుల్లో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఒకరు.అయన కర్నూలు జిల్లాలోని రూపనగుడి గ్రామంలో 1806 నవంబర్ 24వ తేదీన జన్మించారు. బ్రిటీష్ వారు ప్రవేశపెట్టిన నూతన నిబంధనలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టి 1847 సంవత్సరంలో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. సుమారు 3000 మందికిపైగా బ్రిటిష్ పాలకులని చంపారు. అయితే నమ్మకం ద్రోహం వలన బ్రిటిష్ అధికారులకు పట్టుబడిన నరసింహా రెడ్డిని 1847 ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం 7 గంటలకు జుర్రేటి వద్ద కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో బహిరంగంగా ఉరితీశారు. బ్రిటిష్ వారు అంటే భయపడాలని.. నరసింహా రెడ్డి తలను 1877 వరకూ కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వ్రేలాడదీసే ఉంచారు.
దుర్గాభాయి దేశ్‌ముఖ్ - స్వాతంత్ర్య సమరయోధురాలు, సామాజిక సంస్కర్త
దుర్గాభాయి దేశ్‌ముఖ్ భారతదేశ స్వాతంత్ర్య సమరంలో కీలక పాత్ర పోషించిన గొప్ప మహిళ. ఆమె కేవలం స్వాతంత్ర్య సమరయోధురాలే కాకుండా, సామాజిక సంస్కర్తగా కూడా ప్రసిద్ధి చెందారు. రాజమండ్రిలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జూలై 15, 1909న కృష్ణవేణమ్మ, రామారావు దంపతులకు జన్మించారు. పది సంవత్సరాల వయస్సులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించింది. బెనారస్ విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్యులేషన్, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ (పొలిటికల్ సైన్స్‌లో), 1942లో ఎల్.ఎల్.బి పూర్తిచేసింది. ఆమె 12 ఏళ్ళ వయసులోనే తెలుగుగడ్డ పై మహాత్మా గాంధీ రావడం తెలుసుకొని విరాళాలను సేకరించి ఆయనకు అందజేయడమే కాకుండా తన చేతులకు ఉన్న బంగారు గాజులను కూడా విరాళంగా ఇచ్చింది.
మహాత్మా గాంధీ హిందీ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించింది
ఆంధ్ర పర్యటనలలో ఉన్న మహాత్మా గాంధీ చేసిన హిందీ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించింది. చిన్నపిల్లలతో ప్రత్యేకించి 'బాలికా హిందీ ప్రచార సభ'ను ఒక చిన్న కుటీరంలో తన 12వ ఏట ప్రారంభించింది. హిందీ నేర్చుకోవడంలో ఎందరికో ప్రేరణగా నిలిచింది, హిందీ ఆవశ్యకతను తెలుగువారికి తెలిపింది. 1981 మే 9వ తేదీన హైదరాబాదులో పరమపదించారు.