PM Kisan FPO Scheme : రైతుల కోసం కేంద్రం ప్రత్యేక పథకం.. పీఎంకేఎఫ్‌పీఓ కింద రూ.15 లక్షల ఆర్థిక సాయం
భారతదేశంలో సగం కంటే ఎక్కువ ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. పంటలు పండించడానికి రైతులు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. కొన్నిసార్లు వాతావరణ పరిస్థితులు, పురుగుమందులు, విత్తనాల ధరలు, ఎరువుల ధరల పెరుగుదల వల్ల రైతులకు పెట్టుబడి కూడా రాకుండా పోతోంది. దీంతో రైతులు అప్పుల పాలు అవుతున్నారు. ఈ నేపథ్యంలో, రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు నిపుణులు ప్రభుత్వానికి పలు సూచనలు చేస్తున్నారు. మరోవైపు రైతులు కూడా తమ హక్కుల కోసం ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తోంది.
11 మంది రైతులు ఒక సమూహంగా ఏర్పడాలి
అందులో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఒకటి. ఈ పథకం కింద ప్రతి రైతుకూ ప్రతేడాది రూ.6 వేలు ఆర్థిక సాయం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. రైతులకు మరిన్ని వ్యాపార అవకాశాలు కల్పించేందుకు మరో పథకం కూడా కేంద్రం ప్రవేశపెట్టింది. పీఎంకేఎఫ్‌పీఓ పథకం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ప్రధాన మంత్రి కిసాన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్' పథకం ద్వారా రైతులు వ్యాపార పరంగా బలోపేతం అవ్వటానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తోంది. ఈ పథకం కింద, 11 మంది రైతులు ఒక సమూహంగా ఏర్పడి వ్యవసాయ వ్యాపారాలు ప్రారంభించవచ్చు. ప్రభుత్వం ఈ ఎఫ్‌పీఓ (రైతు ఉత్పత్తిదారుల సంస్థ)గా ఏర్పడిన సమూహాలకు రూ.15 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది.
ఈ పథకం ప్రయోజనాలు
ఈ పథకం ద్వారా రైతులు తమ ఉత్పత్తులను వ్యాపార అవకాశాలుగా మారుస్తూ స్వావలంబన సాధించవచ్చు. పాఠశాల స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ వంటి రంగాల్లో భాగస్వామ్యాలు ఏర్పరచుకోవచ్చు. రైతులు ఎఫ్‌పీఓలో భాగమై, వ్యాపారపరంగా ఆర్థిక భరోసా పొందే అవకాశం ఉంటుంది. దరఖాస్తు విధానం రైతులు ఈ పథకం కింద ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే, https://enam.gov.in/web/ అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసి, లాగిన్ అవ్వాలి. అభ్యర్థులు అన్ని వివరాలను సరిగ్గా నింపి, దరఖాస్తు సమర్పించాలి. అంతే కాకుండా, ఈ-నామ్ పోర్టల్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు.