LOADING...
Mokshagundam Visvesvaraya: ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ రూపకర్త.. 'విశ్వేశ్వరయ్య' సేవలు అజరామరం!
ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ రూపకర్త.. 'విశ్వేశ్వరయ్య' సేవలు అజరామరం!

Mokshagundam Visvesvaraya: ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ రూపకర్త.. 'విశ్వేశ్వరయ్య' సేవలు అజరామరం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 15, 2025
11:43 am

ఈ వార్తాకథనం ఏంటి

1908లో భాగ్యనగరం భయానక వరదలను చూసింది. మూసీ నది ఉప్పొంగి వేల ఇళ్లు నీట మునిగిపోయాయి. దాదాపు 15 వేలమంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఆ దారుణ పరిస్థితి మరలా పునరావృతం కాకుండా అడ్డుకట్ట వేసింది జంట నగరాల జీవనాధారమైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ జలాశయాల నిర్మాణమే. ఈ అద్భుత కృతికి రూపకర్త, ఆచరణలోకి దించిన మహనీయుడు - భారతరత్న సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. దేశానికి తరిగిపోని ఆస్తులు సృష్టించిన ఆ మహనీయుడి జయంతి సెప్టెంబరు 15న సందర్భంగా ఆయన జీవితాన్ని, సేవలను మననం చేసుకోవాలి.

Details

బాల్యం, విద్య

విశ్వేశ్వరయ్య 1861 సెప్టెంబరు 15న కర్ణాటకలోని మద్దెనహళ్లిలో జన్మించారు. ఆయన పూర్వీకులు ఆంధ్రప్రదేశ్‌ ప్రకాశం జిల్లా మోక్షగుండం గ్రామానికి చెందినవారు. 12 ఏళ్ల వయసులో తండ్రి మరణించడంతో మామయ్య రామయ్య సంరక్షణలో బెంగళూరులో చదువుకున్నారు. రోజూ 9 కిలోమీటర్లు నడుచుకుంటూ ట్యూషన్లు చెప్పి తన చదువును కొనసాగించారు. హైస్కూల్‌ పూర్తి చేసి, 1881లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత పూణేలో ఉపకార వేతనంతో ఇంజినీరింగ్‌ అభ్యసించారు.

Details

ఇంజినీరింగ్‌ ప్రతిభ

బొంబాయిలో ఏఈగా ఉద్యోగం మొదలు పెట్టి, తర్వాత ఇండియన్‌ ఇరిగేషన్‌ కమిషన్‌లో పనిచేశారు. ప్రపంచంలోనే తొలిసారి జలాశయాల్లో వరద నీటి స్థాయిని బట్టి ఆటోమేటిక్‌గా గేట్లు ఎత్తే విధానాన్ని ఆయన ఆవిష్కరించారు. నీటి మట్టం 6, 8, 10 అడుగులకు చేరితే గేట్లు ఆటోమేటిక్‌గా తెరుచుకునే సాంకేతికతను రూపొందించారు. ఈ టెక్నాలజీ ఇప్పటికీ వినియోగంలో ఉంది. హైదరాబాద్‌లో సేవలు 1908లో ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ చేసిన తర్వాత 1909లో వరదలతో అల్లకల్లోలమైన హైదరాబాద్‌కు నిజాం ఆహ్వానంపై వచ్చారు. మూసీ, ఈసీ నదులపై భారీ జలాశయాలను నిర్మించాలని ప్రతిపాదించారు. ఉస్మాన్‌సాగర్‌: 3.9 టీఎంసీల సామర్థ్యంతో 1912లో నిర్మాణం ప్రారంభమై 1920లో పూర్తయింది. హిమాయత్‌సాగర్‌ : 2.9 టీఎంసీల సామర్థ్యంతో 1920లో ప్రారంభమై 1927లో పూర్తయింది.

Details

వరద నియంత్రణతో పాటు మురుగునీటి వ్యవస్థకు ప్రణాళికలు

1909-1930 మధ్య ఆరు విడతలుగా నగరానికి వచ్చిన విశ్వేశ్వరయ్య, వరద నియంత్రణతో పాటు మురుగునీటి వ్యవస్థకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికీ పాతబస్తీ వంటి ప్రాంతాల్లో ఆయన రూపకల్పన చేసిన భూగర్భ డ్రైనేజీ సమర్థంగా పనిచేస్తోంది. 1930లో హైదరాబాద్ అభివృద్ధి కోసం ఆయన సూచనలు ఇచ్చారు - శుభ్రమైన ఇళ్లు, ఫ్లష్ టాయిలెట్లు, దుమ్ములేని రోడ్లు, ఫుట్‌పాత్‌లు, ఉద్యానవనాలు అభివృద్ధి చేస్తే నగరం దేశంలో ప్రత్యేక స్థానాన్ని పొందుతుందని తెలిపారు.

Details

ఇతర ప్రాజెక్టులు

1912లో మైసూర్‌ దివాన్‌గా పనిచేస్తూ కృష్ణరాజసాగర్‌ జలాశయాన్ని నిర్మించారు. ఇది ఆసియాలో తొలి భారీ ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. విశాఖపట్టణం ఓడరేవులో సముద్ర అలల తీవ్రతను తగ్గించేందుకు ప్రత్యేక పద్ధతి అమలు చేశారు. పాత ఓడలను తెప్పించి వాటిని బండరాళ్లతో నింపి సముద్రంలో ముంచడం ద్వారా అలల శక్తిని తగ్గించారు. తిరుపతి ఘాట్‌ రోడ్‌ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.

Details

 గౌరవాలు, చివరి రోజులు

1955లో భారత ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న'ను ప్రకటించింది. బ్రిటిష్‌ ప్రభుత్వం నైట్‌హుడ్‌తో సత్కరించి ఆయనకు 'సర్‌' బిరుదు ఇచ్చింది. 1962 ఏప్రిల్‌ 12న విశ్వేశ్వరయ్య తుదిశ్వాస విడిచారు. జలవనరుల సద్వినియోగం, పట్టణాభివృద్ధి, సాంకేతికతలో ఆయన చేసిన కృషి తరతరాలకు మార్గదర్శి. భారతదేశం గర్వించదగ్గ స్ఫూర్తిప్రదాతగా విశ్వేశ్వరయ్య చిరస్మరణీయుడు.