ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల కలిగే ఉపయోగాలు, నష్టాలు తెలుసుకోండి
ఈ మధ్యకాలంలో బరువు తగ్గడానికి చాలామంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వైపు మళ్ళుతున్నారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి ప్రస్తుతం తెలుసుకుందాం. అసలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? ఈ రకం ఫాస్టింగ్ చేయాలనుకునేవారు తాము తీసుకునే ఆహారాన్ని చాలా వరకు తగ్గించాలి. అంటే ఒక రోజులో 16గంటలు ఆహారం తీసుకోకుండా ఉండాలి. ఆ 16గంటల సమయంలో ఆహారం తినక పోవడానికి కారణం, మీ బాడీకి మీ శరీరంలో నిల్వ ఉన్న శక్తిని ఉపయోగించుకోమని చెప్పడమే. అంటే శరీరానికి శక్తి కోసం ఆహారం అందించకుండా ఆల్రెడీ శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును శక్తిగా మార్చుకోమని శరీరానికి సూచించడం అన్నమాట. 16గంటలు మాత్రమే కాకుండా 8గంటల టైం పీరియడ్ తో కూడా ఫాస్టింగ్ చేస్తారు.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు
కొవ్వును కరిగిస్తుంది: ఇంతకుముందు చెప్పుకున్నట్టు శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును శక్తిగా శరీరం వాడుకుంటుంది. కాబట్టి ఆ కొవ్వు కరిగిపోతుంది. దీనివల్ల మీరు బరువు తగ్గుతారు. వ్యాధుల బారి నుండి రక్షణ ఇస్తుంది: ఈ ఫాస్టింగ్ వల్ల గుండె సంబంధ సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. బరువు తగ్గడం వల్ల శరీరంలో కొవ్వు స్థాయిలు తగ్గిపోతాయి కాబట్టి డయాబెటిస్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. మెదడు ఆరోగ్యాన్ని పెంచుతుంది: ఈ ఫాస్టింగ్ వల్ల మెదడు ఆరోగ్యం బాగుపడుతుంది. శరీరంలోని చనిపోయిన కణాలు, పనిచేయని కణాలు బయటకు తొలగించబడతాయి.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల కలిగే నష్టాలు
ఆకలి అనేది ఒక్కో మనిషికి ఒక్కో విధంగా ఉంటుంది. అందువల్ల కొందరిలో ఈ ఫాస్టింగ్ కారణంగా తమలోని శక్తి మొత్తం కోల్పోయినట్టుగా ఫీలవుతారు. శరీరానికి కేలరీలు అందకపోవడం వల్ల అలసట ఎక్కువగా ఉంటుంది. నలుగురిలో కలవడం ఇబ్బందిగా మారుతుంది: ఈ ఫాస్టింగ్ ఉన్నవారు ఇతరులతో కలిసి బయటకు వెళ్లడం, పార్టీ చేయడం వంటి వాటికి దూరం కావాల్సి ఉంటుంది. ఆరోగ్య సమస్యలు: ముందే చెప్పినట్టు ఆకలి అనేది ఒక్కో మనిషికి ఒక్కోలా ఉంటుంది. ఈ ఫాస్టింగ్ వల్ల కొందరిలో హార్మోన్ అసమతుల్యత ఏర్పడే అవకాశం ఉంది. మహిళల్లో రుతుక్రమ సమస్యలు వస్తాయి. అలాగే నిద్రలేమి, ఒత్తిడి ఎక్కువ కావడం, థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
మరి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ట్రై చేయవచ్చా?
ఈ ఫాస్టింగ్ ట్రై చేయాలనుకునేవారు చేయవచ్చు. కాకపోతే ఒక్కొక్కరి బాడీ ఒక్కోలా ఉంటుంది. మీ బాడీకి ఈ ఫాస్టింగ్ సూట్ అవుతుందో మీరు తెలుసుకోవాలి. మీకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే ఇంటర్మిటెంట్ట్ ఫాస్టింగ్ చేసే విషయంలో డాక్టర్ ని కచ్చితంగా సంప్రదించండి.