LOADING...
World Athletics Championship : ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రాకు నిరాశ.. సచిన్‌ యాదవ్‌కు చేజారిన పతకం
సచిన్‌ యాదవ్‌కు చేజారిన పతకం

World Athletics Championship : ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రాకు నిరాశ.. సచిన్‌ యాదవ్‌కు చేజారిన పతకం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 18, 2025
06:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2025లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఫలితం నిరాశ కలిగించింది. జావెలిన్ త్రో ఫైనల్‌లో అతడి నుండి పతకాన్ని ఆశించిన అభిమానుల అంచనాలు విఫలమయ్యాయి. టాప్-8లో స్థానం నిలుపుకోవడంలో విఫలమై,చివరికి 8వ స్థానంతో ముగించాడు. అతని అత్యుత్తమ త్రో 84.03 మీటర్లకు మాత్రమే పరిమితమైంది. ఇది అతని వ్యక్తిగత బెస్ట్ ప్రదర్శన కంటే చాలా తక్కువ. క్వాలిఫయింగ్ రౌండ్‌లో మాత్రం నీరజ్ చోప్రా 84.85 మీటర్ల త్రో విసరడంతో సులభంగా ఫైనల్‌కు అర్హత సాధించాడు. కానీ ఫైనల్ వేదికపై ఆ జోరు కొనసాగించలేకపోయాడు.మొదటి ప్రయత్నంలో 83.65 మీటర్లు,రెండో ప్రయత్నంలో 84.03 మీటర్లు,ఆ తర్వాతి ప్రయత్నంలో 82.86మీటర్లకు మాత్రమే అతడి త్రో నమోదు కావడంతో నిరాశ మిగిలింది.

వివరాలు 

నాలుగో స్థానంలో సచిన్ యాదవ్

నీరజ్ చోప్రా ఫలితం ఆశించిన స్థాయిలో రాకపోయినా.. మరో భారత ఆటగాడు సచిన్ యాదవ్ మెరిశాడు. మొట్టమొదటిసారి ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించిన సచిన్, నాలుగో స్థానంలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. తన తొలి ప్రయత్నంలోనే 86.27 మీటర్ల త్రో విసరడంతో వ్యక్తిగత రికార్డును నెలకొల్పాడు. తరువాతి ప్రయత్నాల్లో 85.71, 85.96, 80.95 మీటర్ల దూరం విసిరాడు. ఇప్పటికే 2024లో జరిగిన నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో బంగారు పతకం గెలుచుకున్న సచిన్, భవిష్యత్తులో భారత అథ్లెటిక్స్‌కు గొప్ప ప్రతిభావంతుడిగా ఎదుగుతాడని నిపుణులు భావిస్తున్నారు.

వివరాలు 

పతకాల పట్టికలో: 

ట్రినిడాడ్ & టొబాగోకు చెందిన కెషోర్ వాల్కాట్ 88.16 మీటర్ల అద్భుత త్రోతో స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. గ్రెనడాకు చెందిన ఆండర్సన్ పీటర్స్ 87.38 మీటర్ల త్రోతో రజత పతకాన్ని సాధించాడు. అమెరికా ఆటగాడు కర్టిస్ థామ్సన్ 86.67 మీటర్ల త్రోతో కాంస్య పతకాన్ని గెలిచాడు. సచిన్ యాదవ్ తన అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకానికి అతి దగ్గరగా చేరినా, థామ్సన్ కంటే కేవలం కొన్ని మీటర్ల తేడాతో పతకం చేజార్చుకోవడం భారత అభిమానులను కొంత నిరుత్సాహపరిచింది.

వివరాలు 

అభిమానుల అంచనాలను అందుకోలేకపోయిన నీరజ్ చోప్రా, నదీమ్

ఈ ఫైనల్‌లో పాకిస్తాన్ క్రీడాకారుడు అర్షద్ నదీమ్ కూడా ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాడు. పారిస్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలుచుకున్న నదీమ్, ఇక్కడ 82.75 మీటర్ల త్రో మాత్రమే విసరగలిగాడు. ఫలితంగా 10వ స్థానంలో ముగించాడు. నీరజ్ చోప్రా, నదీమ్ కంటే మెరుగైన స్థానంలో నిలిచినప్పటికీ, ఈసారి ఇద్దరూ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయారు.