LOADING...
AI: ఆరోగ్యరంగంలో విప్లవాత్మక ఆవిష్కరణ.. వ్యాధుల ప్రమాదాన్ని10 సంవత్సరాల ముందే చెప్పగలిగే AI సాధనం
వ్యాధుల ప్రమాదాన్ని10 సంవత్సరాల ముందే చెప్పగలిగే AI సాధనం

AI: ఆరోగ్యరంగంలో విప్లవాత్మక ఆవిష్కరణ.. వ్యాధుల ప్రమాదాన్ని10 సంవత్సరాల ముందే చెప్పగలిగే AI సాధనం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 18, 2025
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

శాస్త్రవేత్తల బృందం ఒక సంచలనాత్మక కృత్రిమ మేధస్సు (AI) సాధనాన్ని అభివృద్ధి చేసింది. ఇది ఒక వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని విశ్లేషించి, 1,000 కంటే ఎక్కువ వ్యాధుల ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేయగలదు. 'డెల్ఫీ-2ఎమ్' (Delphi-2M) అనే ఈ సరికొత్త వ్యవస్థ, వచ్చే పది సంవత్సరాల్లో ఆరోగ్య మార్పులు ఎలా ఉండబోతున్నాయో కూడా ముందే చెప్పగలదు. ఈ పరిశోధనను Nature జర్నల్‌లో ప్రచురించారు. మానవ వ్యాధుల ప్రగతిని పెద్ద ఎత్తున అంచనా వేయడంలో జనరేటివ్ AI సాంకేతికత ఎంతటి సామర్థ్యం కలిగి ఉందో ఇది చూపిస్తుంది.

కార్యాచరణ 

డెల్ఫీ-2ఎమ్ ఎలా పనిచేస్తుంది?

ఈ కొత్త AI టూల్ పెద్ద భాషా నమూనాలు (LLMs) వాడే విధమైన అల్గారిథంల ఆధారంగానే పనిచేస్తుంది. క్యాన్సర్‌, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు వంటి ప్రధాన వ్యాధుల రాక అవకాశాలను ఇది ముందుగానే అంచనా వేస్తుంది. రోగి గత మెడికల్ హిస్టరీలోని వివరాలు.. ఉదాహరణకు నిర్ధారణ తేదీలు, ఊబకాయం స్థాయి, పొగతాగడం లేదా మద్యం అలవాట్లు, వయస్సు, లింగం వంటి అంశాలను పరిశీలిస్తుంది. ఈ AIకి బ్రిటన్‌ Biobank అధ్యయనంలోని 4 లక్షల మంది సమాచారం, అలాగే డెన్మార్క్ జాతీయ ఆరోగ్య రిజిస్ట్రీలోని 19 లక్షల మంది రోగుల డేటాను ఉపయోగించి శిక్షణ ఇచ్చారు.

ప్రభావం

వ్యక్తిగత వైద్యానికి మేలు

ఈ AI సాధనం ఆరోగ్య ప్రమాదాలను వాతావరణ అంచనాల మాదిరిగానే రేట్ల రూపంలో చూపిస్తుంది. ఇవాన్ బిర్నీ (EMBL తాత్కాలిక డైరెక్టర్) మాట్లాడుతూ, రాబోయే కొన్నేళ్లలోనే ఈ టెక్నాలజీ రోగులకు ఉపయోగపడుతుందని తెలిపారు. వైద్యులు ఈ సాధనాన్ని వాడి, రోగులలో ఉన్న ప్రధాన ప్రమాదాలను ముందే గుర్తించి, తగిన జీవనశైలి మార్పులను సూచించగలరని చెప్పారు. ఇది వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ వైపు ఒక పెద్ద ముందడుగు అవుతుంది.

మెరుగైనది

ప్రస్తుత పద్ధతుల కంటే మెరుగైనది

ఇప్పటికే ఉన్న Qrisk వంటి ఆరోగ్య అంచనా పద్ధతుల కంటే డెల్ఫీ-2ఎమ్ అనేక వ్యాధులను ఒకేసారి, దీర్ఘకాలం పాటు విశ్లేషించగల సామర్థ్యం కలిగి ఉందని బిర్నీ అన్నారు. ఒకేసారి ఒక్క వ్యాధి మాత్రమే అంచనా వేసే మోడళ్లతో పోలిస్తే, ఈ కొత్త AI పద్ధతి రోగి గత వ్యాధి చరిత్ర ఆధారంగా ఖచ్చితమైన అంచనాలు ఇస్తుందని శాస్త్రవేత్తల బృందం పేర్కొంది.

భవిష్యత్తు అవకాశాలు 

ఆరోగ్యరంగంలో విప్లవానికి దారి

జర్మన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన ప్రొఫెసర్ మోరిట్జ్ గెర్స్టంగ్ మాట్లాడుతూ, డెల్ఫీ-2ఎమ్ మానవ ఆరోగ్యాన్ని, వ్యాధుల మార్గాన్ని కొత్త కోణంలో అర్థం చేసుకునే దిశగా ఒక కీలక అడుగని తెలిపారు. జనరేటివ్ మోడల్స్ భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆరోగ్య అవసరాలను ముందుగానే గుర్తించి, వైద్యాన్ని వ్యక్తిగతీకరించడంలో సహకరిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు సంభవించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.