Rashi Singh: రాశి సింగ్ జీవితాన్ని మార్చిన కేరళ ట్రిప్.. ఇంటికి వచ్చి గుండు చేసుకున్న యువతి
ఈ వార్తాకథనం ఏంటి
రాశి సింగ్ జీవితం ఒకప్పుడు సాధారణ యువతిలాగే ఎంతో ఆనందంగా సాగింది. భోపాల్‌కు చెందిన ఆమె 22 ఏళ్ల వయస్సు వరకూ సరదాగా, ఉత్సాహంగా జీవించారు. చదువుల్లో ప్రతిభ కనబరిచి డిగ్రీ పూర్తయ్యాక అనుకున్న ఉద్యోగాన్ని కూడా సంపాదించుకున్నారు. కుటుంబ సభ్యులను ఒప్పించి బెంగళూర్‌కు వెళ్లి ఆర్కిటెక్ట్‌గా కెరీర్ ప్రారంభించారు. మంచి జీతం, ఉద్యోగ గుర్తింపు మాత్రమే కాదు.. చిన్నప్పటి నుంచి ప్రేమగా పెంచిన తల్లిదండ్రులను ఇకపై తాను చూసుకోగలనన్న నమ్మకం ఆమె ఆనందాన్ని మరింత పెంచింది. అయితే ఒక్కసారిగా ఆమె జీవితంలో ఊహించని మార్పు చోటుచేసుకుంది. అకస్మాత్తుగా జుట్టు ఊడిపోవడం ప్రారంభమైంది. మొదట్లో పని ఒత్తిడి, వ్యక్తిగత సంరక్షణలో నిర్లక్ష్యం కారణమేమో అనుకున్నారు.
వివరాలు
ఇమ్యూన్ సమస్య ఉన్నట్లు నిర్ధారణ
కానీ కొన్ని రోజుల్లోనే తలపై మచ్చలు కనిపించడంతో పరిస్థితి తీవ్రత అర్థమైంది. ఈ విషయాన్ని గమనించిన ఆమె తల్లి వెంటనే వైద్యులను సంప్రదించగా, రాశికి 'అలోపీషియా అరియేటా' అనే ఆటో ఇమ్యూన్ సమస్య ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ వ్యాధి గురించి అప్పటివరకు ఎప్పుడూ వినకపోవడంతో మొదట పెద్దగా పట్టించుకోలేదని రాశి చెబుతారు. అయితే సగానికి పైగా జుట్టు రాలిపోవడంతో అసలు పరిస్థితి ఎంత తీవ్రమో అర్థమైందని గుర్తుచేసుకుంటారు. బయటకు వెళ్లడానికే భయపడేదాన్నని, చుట్టుపక్కల వాళ్లు ఏమనుకుంటారో అన్న ఆలోచనలతో కొన్ని రోజులు గదికే పరిమితమయ్యానని తెలిపారు. అనంతరం విగ్ ధరించి ఆఫీసుకు వెళ్లడం ప్రారంభించారు.
వివరాలు
అందం అంటే కేవలం జుట్టు మాత్రమే కాదు
కూతురు మానసికంగా కుంగిపోతున్న విషయాన్ని గమనించిన ఆమె తల్లి, కనీసం ప్రదేశం మారితే మనసులో మార్పు వస్తుందేమోనని భావించి కేరళ పర్యటనకు పంపించారు. ఆ ప్రయాణమే రాశి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. కేరళలో ఓ యువతిని కలిసిన సందర్భాన్ని రాశి ఇప్పటికీ మర్చిపోలేరు. ఆ అమ్మాయి గుండు చేయించుకుని ఉండటాన్ని చూసి, "నీకు నీ జుట్టంటే ఇష్టం లేదా? ఎందుకు ఇలా చేశావు?" అని అడిగారట. దానికి ఆమె, "నా జుట్టు.. నా ఇష్టం. ఇలా ఉండటమే నాకు అందంగా అనిపించింది" అని సమాధానం ఇచ్చిందట. ఆ ఒక్క మాటే తనలో ఉన్న ఆత్మన్యూనత భావాన్ని పూర్తిగా మార్చేసిందని రాశి చెబుతున్నారు. అందం అంటే కేవలం జుట్టు మాత్రమే కాదని అప్పుడు అర్థమైందన్నారు.
వివరాలు
ప్రజల నుంచి అపారమైన మద్దతు
ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తాను కూడా గుండు చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ విషయం చెబితే తల్లి బాధపడుతుందని భావించి, గదిలో ఒంటరిగా అద్దం ముందు కూర్చుని రేజర్‌తో తన జుట్టంతా స్వయంగా షేవ్ చేసుకున్నారు. తర్వాత తన ఫొటోను సోషల్ మీడియా వేదికలో పంచుకుంటూ తన పరిస్థితి, తీసుకున్న నిర్ణయం గురించి వివరించారు. మొదట వ్యతిరేక స్పందనలు వస్తాయని అనుకున్నప్పటికీ, అందుకు భిన్నంగా ప్రజల నుంచి అపారమైన మద్దతు లభించింది. ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ అనేక సందేశాలు, కామెంట్లు రావడంతో తనను తాను అంగీకరించుకోవడం ప్రారంభించారని రాశి తెలిపారు. అయితే సమాజం నుంచి విమర్శలు, వెక్కిరింతలు మాత్రం ఎదురయ్యాయి.
వివరాలు
సామాజిక కార్యక్రమాలు ఎంతోమందికి స్ఫూర్తి
"క్యాన్సర్ వచ్చిందట", "ఏదో ప్రమాదకరమైన వ్యాధి ఉందట" అంటూ కొందరు గుసగుసలాడేవారని ఆమె చెప్పారు. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా తన ప్రయాణాన్ని కొనసాగించారు. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచాలనే లక్ష్యంతో రాశి మోడలింగ్ రంగంలో అడుగుపెట్టారు. ఉద్యోగం చేస్తూనే ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఫెమినా మిస్ ఇండియా 2024 పోటీల్లో కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా లాక్మే వంటి ప్రముఖ బ్యూటీ బ్రాండ్లకు మోడల్‌గా పనిచేసే అవకాశాన్ని కూడా అందుకున్నారు. ప్రస్తుతం డిజిటల్ కంటెంట్, కొలాబరేషన్ల ద్వారా బాడీ పాజిటివిటీ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.